Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Wednesday, September 12, 2012

Shiridi Sai Movie Review


తెలుగు సినిమాలో స్టార్ హీరో అంటే సాహసానికి మారుపేరు అన్న పంధాకి కామా పెట్టి స్టార్ లో నటుడు కూడా ఉంటాడు అని అన్నమయ్య, రామదాసు చిత్రాలతో నిరూపించిన కింగ్ నాగార్జున తనలోని నటుడికి పరిపూర్ణత చేకూర్చటానికి సాయి బాబా గా షిరిడి సాయి అనే చిత్రం లో నటించాడు. ఆ చిత్రం ఈ వారం మన ముందుకు వచ్చింది. సాయి కృప ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై ఎ . మహేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకుడు. శ్రీకాంత్, శ్రీహరి, శరత్ బాబు, కమలిని ముఖర్జి తదితరులు ఇతర ప్రధాన పాత్రలలో కనిపించారు . కీరవాణి తన బాణీలతో సాయిబాబాను సేవించగా పరుచూరి బ్రదర్స్ మాటలతో పూజించారు.

దర్శకుడిగా రిటైర్మెంట్ స్టేజ్ లో ఉన్న రాఘవేంద్ర రావు ఇప్పటివరకు తానూ రూపొందించిన అన్నమయ్య , శ్రీరామదాసు సహా ప్రతి సినిమాలో శృంగారానికి ప్రత్యేక స్థానం ఇస్తూ వచ్చాడు. కాని తన కెరీర్ లోనే మొదటిసారి శృంగారానికి అవకాశం ఇవ్వకుండా  'షిరిడి సాయి' సినిమాను రూపొందించటం విశేషంగా చెప్పుకుంటున్నారు ఫిలింనగరవాసులు. స్వామి అనుగ్రహం కోసం పరితపించే భక్తుడిగా రెండు సార్లు తెలుగు ప్రేక్షకులను అలరించిన నాగార్జున భగవంతుడిగా ఎలా ఆకట్టుకుంటాడో.... అని ఈ సినిమా కోసం సిని వర్గాలతో పాటు సామాన్య ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఫైకి ఎంత భక్తిరస చిత్రం అని చెబుతున్నా సినిమా రుపకర్తల అసలు ఉద్దేశం రాబడే కాబట్టి సినిమాలోని తప్పొప్పులను చర్చించక తప్పని పరిస్థతిని దృష్టిలో పెట్టుకుని ఈ 'షిరిడి సాయి' ఆయనను ఆరాధించే భక్తులకే పరిమితం అయ్యిందో...లేక అందరిని ఆకట్టుకునేట్టు ఉందో..... సమీక్షలో చూద్దాం .

కధ :
 చెడును అంతమొందించి , మంచిని ప్రోత్సహించి, ఆదర్శప్రాయమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడిపే విధంగా మనిషిని మేల్కొల్పెందుకు భగవంతుడు వివిధ కాలాలలో వివిధ రూపాలలో అవతరించాడు , మానవులను సంస్కరించాడు. వారిలో ఎందఱో దేవుళ్ళు పురాణాల్లో , పుస్తకాల్లో , కధల్లో మాత్రమే వినిపించారు, కనిపించారు. కాని సమకాలికంగా ఒక మహానుభావుడు ప్రత్యక్షంగా మనుషులతో మమెకమై శ్రద్ద, సబూరి తో జీవితాన్ని పరమపావనం చేసుకోవచ్చని భోదించి కోట్లమంది భక్తుల గుండెల్లో దైవంగా కొలువుదీరాడు. అలాంటి ఆ సాయిబాబా సత్చరిత్రకు మరో తెర రూపమే ఈ 'షిరిడి సాయి'. సాయి జననం, షిరిడి ఆగమనం, అక్కడవారి జీవితాలను ప్రభావితం చేయటంతో పాటు బాబా జీవన గమనంలోని కొన్ని ముఖ్య అంశాలను స్పృశిస్తూ  ఆయన మహా సమాధి వరకు సాగుతుంది ఈ షిరిడి సాయి చిత్రం.

విశ్లేషణ:
 'షిరిడి సాయి ' సినిమా గురించి చెప్పాలంటే సాయి బాబాను  దేవుడిగా గుర్తిస్తూ... అయన గురించి పెద్దగా తెలియని వారికీ బాగానే ఉండొచ్చు కాని బాబాను మనస్పూర్తిగా ఆరాదిస్తూ .... అయన గురించి పూర్తీ అవగాహన ఉన్నా వారికీ ఈ సినిమా ఒక సాదారణ చిత్రంలా కనిపిస్తుంది. అంతే కాకుండా పాత 'షిరిడి సాయి మహత్యం' సినిమాను మనసులో పెట్టుకుని ఈ సినిమాను చూస్తే మాత్రం నిరాశ పడటం ఖాయం.  వేలెత్తి చూపిస్తున్నాం అని కాదు కాని పాత సినిమాలో ఉన్నంత వివరణ కాని , అనుభూతి కాని , తన్మయత్మం కాని ఈ ఈ సినిమాలో కనపడవు. సినిమా ప్రచారంలో భాగంగా ఇంతకు ముందు చూడని బాబా జీవితంలోని విశేషాలను చూపెడుతున్నాం అని చెప్పారు. కాని  అందుకు తగ్గట్టు అవసరమైన పరిశోధన మాత్రం చేసినట్టు కనిపించలేదు.  

నిజంగా బాబా గురించి చెప్పాలనుకుంటే సాయి భక్తులకు బాబా సమానమైన 'సాయి సత్చరితం ' గ్రంధాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే సరిపోతుంది. అందులోని బాబా తత్త్వం , లీలలు మనిషిగా అవతరించిన మహానుభావుడి అంతర్యాన్ని తెలియజేస్తాయి. వాటిని విశాలమైన మనసుతో కధ గా కూర్చుకోగలిగితే.. ఒకటి కాదు 100 సినిమాలకు సరిపడ కధలను రూపొందించుకోవచ్చు. అనంతమైన ఆద్భుత విశేషాల సమాహారం బాబా జీవితం. 

కానీ ఈ సినిమా రుపకర్తలలో బాబా మీద నమ్మకం కంటే సినిమాను కమర్షియల్ ఫార్ములా ప్రకారమే రూపొందించాలి అన్నా సంకుచిత భావమే కనిపించింది. బాబా దేవుడు ..... హీరో కాదు...! కాని ఆయనను ఒక సినిమా హీరోగా చూపించే ప్రయత్నం ఈ  సినిమాలో జరిగింది. అందుకోసం ఫుల్ మూవీ రోల్ ఉన్న బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడే భాటియా అనే ఒక విలన్ , అతనికి ఇద్దరు కామెడీ చేసే అనుచరులు, వారు చేసే వెటకారం వెరసి సినిమా సాదారణ సినిమాలా అనిపిస్తుంది. 

ఇక్కడ రెండు విషయాలు చెప్పుకోవాలి. ఒకటి బాబా జీవన గమనంలో ఆయనను ఎందఱో ఎన్నో రకాలుగా శంకించి... పరీక్షించి ఆయన మహిమలను అనుభవించి పరమ భక్తులుగా మారిపోయారు.  కాని ఈ సినిమాలో భాటియా మాత్రమే మొదటి నుండి చివరి వరకు బాబాను పలురకాలుగా అవమానపరచటానికి ప్రయత్నాలు చేస్తూ భంగపడతాడు . అదీ ఎంతలా అంటే బాబా పాత్ర కంటే భాటియా పాత్రే ప్రేక్షకుల మైండ్ లో ఫిక్స్ అయ్యేలా...! 

ఇక రెండో విషయం ఏమిటంటే సినిమా దర్శక రచయతలు ప్రేక్షకులను, వారి అభిరుచిని  తక్కువగా చూడటం..! ప్రేక్షకులు దేవుడు సినిమాను చూడటానికి భక్తీ భావంతో వస్తారు... అదే సినిమాలో ఆశిస్తారు కూడా..!  అలాంటిది వెటకారపు సన్నివేశాలతో చీప్ కామెడీని  సృష్టించటం ప్రేక్షకులను తక్కువ చేసి చూడటమే అవుతుంది. ప్రత్యేకంగా చెప్పకపోయిన కమర్షియల్ అంశాలు లేక పొతే జనాలు సినిమా చూడరు అనే సంకేతం ఇవ్వటం వారిని అవమానపరచటమే...! 

అలానే బాబా మహిమలను యధార్దానికి దూరంగా, కొంత నాటకీయతను జోడించి చిత్రీకరణ సౌలభ్యం కొరకు కలగపులగం చూపించారు. దాంతో సినిమాకు అవసరమైన ఫీల్ పండక కృత్రిమంగా అనిపిస్తుంది. కాని చివరి పావుగంట... అంటే బాబా అంత్యదశను మాత్రం బాగా చిత్రీకరించారు.  ఆ కాసేపు కలిగిన భావమే సినిమా అంత ఉన్నట్టయితే తప్పక జనరంజక చిత్రం అయ్యేది. మొత్తంగా మాత్రం ఈ 'షిరిడి సాయి' ఒక అసంపూర్ణమైన అనుభవం. 

మాస్ చిత్రాల రారాజులుగా వెలుగొందుతున్న రచన ద్వయం పరుచూరి సోదరురుల సంభాషణలు బాబా తత్వాన్ని, బోధనలను తగు రీతిలో ప్రేక్షకులకు చేరువ చేయలేకపోయాయి. కీరవాణి అందించిన బాణిలలో 3 పాటలు మినహా మిగతావి పెద్దగా ఆకట్టుకోలేదు. బ్యాక్ స్కోరు కూడా చెప్పుకునేట్టు లేదు. యస్ గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఉన్నతంగా ఉంది. నిర్మాణాత్మక విలువలు పర్వలేదనిపిస్తాయి. 

నాగార్జున బాబాగా రాణించలేక పోయాడు. భయమో, గౌరవమో... మరేదైనా కావొచ్చు.... బాబా పాత్రలో నాగార్జున లీనమైనట్టు కనిపించలేదు. సాయి బాబాగా డైలగుల్లోను , ఆహార్యంలోను మరింత పరిణితి పదర్శించవలసిన అవసరం కనిపించింది. కాని క్లైమాక్స్ లో మాత్రం  తన శైలిలో నటించి మెప్పించాడు. భాటియగా షాయాజీ షిండే , అతని అనుచరులుగా ఆలీ, అనంత్ నటన కొన్నిసార్లు ఎబెట్టు కలిగించింది. వేల్స్ దోరగా శ్రీహరి ఆకట్టుకున్నాడు. శ్రీకాంత్ తన పాత్రకు న్యాయం చేశాడు. ఉంటానికి పెద్ద పెద్ద నటులే ఉన్నప్పటికీ ఏ ఒక్కరి పాత్ర ఆకర్షణియ్యం గా కనిపించదు. 

ప్లస్ పాయింట్స్ : 

కీరవాణి స్వరపరిచిన పాటలు, క్లైమాక్స్ కొంత  వరకు సినిమాకు ప్లస్ పాయింట్స్.

మైనస్ పాయింట్స్:

మహత్యం తక్కువైన కధ , అనుభూతి లేని కధనం , నాసిరకం కామెడీ ప్రదానంగా మైనస్ పాయింట్స్ 

కొసమెరుపు: 

 షిరిడి సాయి సినిమాకు అయిన బడ్జెట్ ను , విడుదలకు ముందు జరిగిన ప్రచారంతో పోల్చుకుంటే కమర్షియల్ గా సేఫ్ ప్రాజెక్ట్ అని ట్రేడ్ వర్గాలు  అంచనా వేశాయి ...!  కాని ఎన్ని మాట్లాడుకున్న సినిమా ఫలితానికి సంబంధించి అంతిమ తీర్పు జనాలదే ...! సోమవారం నాటి కలెక్షన్లను చూస్తే మిశ్రమ స్పందన కనపడుతుంది. ఆఫై ఫలితం బాబా చేతిలోనే ఉంది. 


Maruthi Talkies Rating 2.5 out of 5
      



No comments:

Post a Comment