Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Friday, September 28, 2012

Prabhas 'Rebel' Movie Review


గత రెండు సినిమాలుగా  వెజిటేరియన్ మీల్స్ తో సరిపెడుతున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మాస్ అభిమానులను  సంతృప్తి పరచటానికి కారం మసాల దిట్టంగా అద్ది లారెన్స్ వండిన మాస్ మసాల మూవీ 'రెబెల్' తో ఈ వారం దియేటర్ లకు వచ్చాడు. బాలాజీ సిని మీడియా బ్యానర్ ఫై లారెన్స్ దర్శకత్వంలో నిర్మితమైన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన తమన్నా, దీక్ష సెత్ హీరోయిన్ లుగా నటించారు. సాంకేతికంగా అత్యున్నతంగా రూపొందించిన ఈ సినిమా మీద మాస్ ప్రేక్షకుల అంచనాలు వీపరీతంగా ఉన్నాయి. అందుకు నిదర్శనం బాక్స్ ఆఫీసు దగ్గర టికెట్స్ కోసం జరుగుతున్నా హంగామాయే...!

క్లాసు సినిమా హిట్లు ఇచ్చే ఆనందం కంటే... ఒక్క మాస్ సినిమా హిట్ ఇచ్చే కిక్కే వేరు  అని తెలుగు పరిశ్రమలోని హీరోలందరూ దృడంగా నమ్ముతారు. ప్రస్తుతం ప్రభాస్ ఆ కిక్ కోసమే తహతహలాడుతున్నాడు. డాన్సులతోనే కాకుండా దర్శకుడిగా కూడా మాస్ ప్రేక్షకుల ఆరాధ్యదైవంగా అవతరించిన రాఘవ లారెన్స్ ప్రభాస్ ను ఇంతకు మునుపు చూడని కొత్త రూపంలో చుపిస్తున్నానని ప్రభాస్ అభిమానులకు ప్రామిస్ చేశాడు. ఆ మాటను లారెన్స్ ఎంతవరకు నిలబెట్టుకున్నడో ..... మన సమీక్షలో చూద్దాం ...! 

కధ :

రిషి (ప్రభాస్) స్టీఫెన్ రాబార్ట్స్ అనే చీకటి సామ్రాజ్యపు అజ్ఞాత డాన్ ద్వయాన్ని వెతుకుతూ హైదరాబాద్ వస్తాడు. అక్కడ తనకు గైడ్ గా వచ్చిన నరసరాజు అలియాస్ నసరాజు (బ్రహ్మానందం ) ఇచ్చిన సమాచారంతో  స్టీఫెన్ రాబార్ట్స్ కింద పనిచేసే వాళ్ళ గురుంచి తెలుసుకుంటాడు. కాని స్టీఫెన్ రాబార్ట్స్ ను కలుసుకోవటం ఆషామాషీ విషయం కాదని తెలుసుకుంటాడు. అందుకని స్టీఫెన్ రాబార్ట్స్ ప్రధాన అనుచరుడు నాను కూతురు నందిని(తమన్నా)ని ప్రేమలోకి దింపెందుకు  నాటకం ఆడి  విజయం సాదిస్తాడు . తరవాత నందిని సాయంతో స్టీఫెన్ రాబార్ట్స్ ఎవరో తెలుసుకోగలుగుతాడు. ఆ మరుక్షణమే రిషి అసలు రూపం 'రెబెల్' బయటకు వస్తుంది. ఆ ఫై యుద్ధం మొదలవుతుంది. అసలు ఇంతకీ రెబెల్ కు స్టీఫెన్ రాబార్ట్స్ తో పంతం దేనికి...? వారి ఫై అతను చేసిన యుద్దంలో చివరికి ఎలా గెలిచాడు అన్నది మిగిలిన కధ . 

విశ్లేషణ :

'రెబెల్' మీద మాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు సంవత్సరంన్నరగా  పెంచుకున్న ఆశలను 2 గంటల్లో పటాపంచలు చేశాడు రాఘవ లారెన్స్ . అంచనాలను పీలికలు చేసి గాలిలోకి విసిరేశాడు . అనుకున్నదొక్కటి అయినదోక్కటి అన్నట్టు బిక్క ముఖాలు వేశారు ప్రభాస్ అభిమానులు ఈ సినిమా  చూసి...! పొరపాటు ఎక్కడ జరిగింది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెగ్యులర్ గా లారెన్స్  చేసేదే కాకపోతే ఈ సారి కాలం కలిసి రాలేదు. అయినా  సందర్భం డిమాండ్ దృష్ట్యా మనము చర్చించుకోవాలి.  

నృత్య దర్శకుడిగా లారెన్స్ కున్న ప్రతిభ అపారం , అలానే టేకింగ్ విషయంగా కూడా కొంతవరకు పరవలేదనిపిస్తాడు. కాని కధ , కధనాల విషయంలో మాత్రం ఎప్పుడు పూరే...! ఒక్క 'స్టైల్' సినిమా మినహా ప్రతి సినిమాలోనూ ఈ లోపం కనపడుతుంది.  లోపం ఉన్నప్పటికీ మాస్ కు కావలసిన డాన్సులు, ఫైట్లు దిట్టంగా పెట్టి నెట్టుకొచ్చేవాడు. కాని ఈ రెబెల్ లో ఆ అంశాలు సరిగా పేలక పోవటంతో అసలుకే ఎసరువచ్చింది.  అంతే కాకుండా టేకింగ్ పరంగా కూడా లారెన్స్ వైపు నుండి కొంత నిర్లక్ష్యం కనపడింది. ఎందుకంటే అతని సినిమాలో మొత్తం కాకపోయినా కొన్ని ఎమోషన్ సన్నివేశాల వరుకన్న బాగా చిత్రీకరించేవాడు. కాని ఈ సినిమాలో  అవసరం, అవకాశం ఉన్నప్పటికీ చాల సన్నివేశాల్లో ఎమోషన్ ను పండించలేక పోయాడు. అంతే కాకుండా స్వతహాగా కొరియోగ్రాఫర్ అయ్యుండి కూడా తమన్నా ఇంట్రడక్షన్ సాంగ్ మినహా మరే పాటలోను తన ప్రత్యేకతను ప్రదర్శించలేదు.  

'రెబెల్' ఒక ఆసక్తి కలిగించే మర్డర్ ఎపిసోడ్ తో మొదలవుతుంది. ఆ ఫై దర్శకుడు హీరో ను కూల్ గా ఇంట్రోడుస్ చేసి అంతే కూల్ గా సినిమాను నడిపించటం మొదలు పెడతాడు. తరవాత బ్రమ్మి, కోవై సరళ రెగ్యులర్ రొటీన్ కామెడీ సన్నివేశాలతో ఇంటర్వెల్ వరకు నడుస్తూ ప్రేక్షకులకు  కొద్దిగా అసహనాన్ని కలిగిస్తుంది. కాని ఇంటర్వల్ బ్యాంగ్ ఊహించని విధంగా ఉండి థ్రిల్ చేస్తుంది. కాని ఆ ఉత్సాహం అక్కడితోనే ముగిసిపోతుంది. రెండో సగం మొదలైన దగ్గర నుండి మనకు తెలియకుండానే సినిమాతో కనెక్షన్ కొల్పొతూఉంటాం...! మద్యలో ఒకటి అర ఫైట్లు ఆశ పెట్టినప్పటికీ కధతో  కనెక్షన్ ఉండదు కాబట్టి పెద్దగా ఎంజోయ్ చేయలేం. క్లామక్స్ లో హీరో విలన్స్ కొట్టుకోవటం చూడటానికి  బానే ఉంది కానీ లాజిక్ విషయంగా వెటకారంగా తోస్తుంది. మొత్తంగా సినిమా నిరాశ పరుస్తుంది.

దర్శకుడిగా లారెన్స్ రాణించలేకపోయాడు. సినిమాకే ఆయువు పట్టులాంటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను పేలవంగా రూపొందించాడు. మొదటి సారి కృష్ణంరాజు, ప్రభాస్ నాన్న కొడుకులుగా నటిస్తున్నారంటే ఎంతో  ప్రత్యేకంగా ఊహించుకుంటారు అభిమానులు. కాని ఆ విషయం మీద లారెన్స్  శ్రద్ద పెట్టినట్టే కనిపించదు. సన్నివేశాలే కాదు హీరో తో సహా ఏ  ఒక్క పాత్రను ఆకట్టుకునేట్టు తీర్చిదిద్దలేదు. ఆయన స్వరపరచిన పాటలు కూడా పెద్దగా మెప్పించలేక పోయాయి.  చిన్నా అందించిన బ్యాక్ స్కోరు క్యాచిగా లేదు. డార్లింగ్ స్వామి మాటలు పేలవంగా ఉన్నాయి. చాలా సన్నివేశాల్లో నాన్ సింక్ డైలాగులు వ్రాసి తన అసమర్ధతను చాటుకున్నాడు. కధ  రీత్యా మాటల్లో ఉండాల్సిన పవర్, కమాండ్ ఎక్కడ కనిపించదు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది . నిర్మాణాత్మక విలువలు ఉన్నతంగా ఉన్నాయి. 

ప్రభాస్ దర్శకుల నటుడు ... ఎంత వాడుకుంటే అంత కనపడతాడు. దర్శకుడు ప్రభాస్ ను పూర్తిగా వినియోగించుకోలేదు.  పై పెచ్చు ప్రభాస్ లోని  కామెడీ యాంగిల్ ను కొత్తగా చూపించాలని ట్రై చేసాడు కాని అందులో క్లారిటి లేకపోవటం మూలంగా ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. మొత్తంగా ఈ సినిమా ఓ సంవత్సరం తరవాత ప్రభాస్ ను గుర్తు చేసుకున్నాం... అన్నట్టు ఉంటుందేకాని... ఎప్పటికి గుర్తుపెట్టుకునే సినిమాగా మాత్రం ఉండదు. ఇక పొతే ఈ సినిమా వల్ల ఎవరికీ లాభం ఉన్నా లేక పోయిన తమన్నాకి మాత్రం బోలెడంత లాభాన్నితెస్తుంది. ఈ సినిమాలో అమ్మడి డాన్సులు చూస్తే  మరో నాలుగైదు సంవత్సరాలు కాల్షీట్ లు ఖాళి లేనంత బిజీ అయిపోవటం ఖాయం అనిపిస్తుంది. నటనకు స్కోప్ తక్కువ ఉన్నప్పటికీ అవకాశం ఉన్న మేర శక్తి వంచన లేకుండా ఎంటర్ టైన్ చేసింది. 

దీక్షా  సేథ్  తన పరాజయాల పరంపరను నిరాటంకంగా కొనసాగిస్తుంది. ఏ  విధమైన మార్పు లేకుండా తన భయంకరమైన నటనతో జనాలను ఈ సినిమాలో కూడా బయపెట్టింది. కృష్ణంరాజు రెబెల్ గా హుందాగా నటించారు. అయన చేసిన ఫైట్స్ రెబెల్ స్టార్ అభిమానులకు పాత రోజులను గుర్తుకుతెస్తాయి. బ్రహ్మానందం, కోవై సరళ కామెడీ కొద్దిగా ఇబ్బందిగా అనిపించినప్పటికీ నవ్విస్తుంది. ప్రదీప్ రావత్ , ముఖేష్ రుషి, సుప్రీత్ తదితరులు వారి పాత్రలకనుగుణంగా బాగా నటించారు.  

 ప్లస్ పాయింట్స్ : 

ఇంటర్వల్ బ్యాంగ్ , తమన్నా ప్రధానంగా ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. 

మైనస్ పాయింట్స్: 

కధ , కధనం, మాటలు, సంగీతం, దర్శకత్వం ప్రధానమైన లోపాలు ఈ సినిమాకు.

కొసమెరుపు : 

బిల్లా తరవాత  నాలుగు సంవత్సరాలుగా వెజిటేరియన్ మీల్స్ తో సర్దుకు పోతున్న ప్రభాస్ అభిమానులు ఏంతో ఆశగా ఎదురు చూసిన నాన్ - వెజ్ మీల్స్ 'రెబెల్'  కారం, మసాలలా  కొలతలు కుదరక నిరాశపరిచింది. 'ఏ ' సెంటర్స్ లో పెదవి విరుపులు వినపడుతున్నప్పటికి , 'బి' 'సి' లలో రెబెల్ కు పట్టు దొరకపుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి . ఇక ఈ సినిమా భవితవ్యం 'మాస్ ' మహారాజుల  మీదే ఆధారపడి ఉంది.  

 Maruthi Talkies Rating : 2.5 out of  5



     

No comments:

Post a Comment