గత రెండు సినిమాలుగా వెజిటేరియన్ మీల్స్ తో సరిపెడుతున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మాస్ అభిమానులను సంతృప్తి పరచటానికి కారం మసాల దిట్టంగా అద్ది లారెన్స్ వండిన మాస్ మసాల మూవీ 'రెబెల్' తో ఈ వారం దియేటర్ లకు వచ్చాడు. బాలాజీ సిని మీడియా బ్యానర్ ఫై లారెన్స్ దర్శకత్వంలో నిర్మితమైన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన తమన్నా, దీక్ష సెత్ హీరోయిన్ లుగా నటించారు. సాంకేతికంగా అత్యున్నతంగా రూపొందించిన ఈ సినిమా మీద మాస్ ప్రేక్షకుల అంచనాలు వీపరీతంగా ఉన్నాయి. అందుకు నిదర్శనం బాక్స్ ఆఫీసు దగ్గర టికెట్స్ కోసం జరుగుతున్నా హంగామాయే...! క్లాసు సినిమా హిట్లు ఇచ్చే ఆనందం కంటే... ఒక్క మాస్ సినిమా హిట్ ఇచ్చే కిక్కే వేరు అని తెలుగు పరిశ్రమలోని హీరోలందరూ దృడంగా నమ్ముతారు. ప్రస్తుతం ప్రభాస్ ఆ కిక్ కోసమే తహతహలాడుతున్నాడు. డాన్సులతోనే కాకుండా దర్శకుడిగా కూడా మాస్ ప్రేక్షకుల ఆరాధ్యదైవంగా అవతరించిన రాఘవ లారెన్స్ ప్రభాస్ ను ఇంతకు మునుపు చూడని కొత్త రూపంలో చుపిస్తున్నానని ప్రభాస్ అభిమానులకు ప్రామిస్ చేశాడు. ఆ మాటను లారెన్స్ ఎంతవరకు నిలబెట్టుకున్నడో ..... మన సమీక్షలో చూద్దాం ...!
కధ :
రిషి (ప్రభాస్) స్టీఫెన్ రాబార్ట్స్ అనే చీకటి సామ్రాజ్యపు అజ్ఞాత డాన్ ద్వయాన్ని వెతుకుతూ హైదరాబాద్ వస్తాడు. అక్కడ తనకు గైడ్ గా వచ్చిన నరసరాజు అలియాస్ నసరాజు (బ్రహ్మానందం ) ఇచ్చిన సమాచారంతో స్టీఫెన్ రాబార్ట్స్ కింద పనిచేసే వాళ్ళ గురుంచి తెలుసుకుంటాడు. కాని స్టీఫెన్ రాబార్ట్స్ ను కలుసుకోవటం ఆషామాషీ విషయం కాదని తెలుసుకుంటాడు. అందుకని స్టీఫెన్ రాబార్ట్స్ ప్రధాన అనుచరుడు నాను కూతురు నందిని(తమన్నా)ని ప్రేమలోకి దింపెందుకు నాటకం ఆడి విజయం సాదిస్తాడు . తరవాత నందిని సాయంతో స్టీఫెన్ రాబార్ట్స్ ఎవరో తెలుసుకోగలుగుతాడు. ఆ మరుక్షణమే రిషి అసలు రూపం 'రెబెల్' బయటకు వస్తుంది. ఆ ఫై యుద్ధం మొదలవుతుంది. అసలు ఇంతకీ రెబెల్ కు స్టీఫెన్ రాబార్ట్స్ తో పంతం దేనికి...? వారి ఫై అతను చేసిన యుద్దంలో చివరికి ఎలా గెలిచాడు అన్నది మిగిలిన కధ .
విశ్లేషణ :
'రెబెల్' మీద మాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు సంవత్సరంన్నరగా పెంచుకున్న ఆశలను 2 గంటల్లో పటాపంచలు చేశాడు రాఘవ లారెన్స్ . అంచనాలను పీలికలు చేసి గాలిలోకి విసిరేశాడు . అనుకున్నదొక్కటి అయినదోక్కటి అన్నట్టు బిక్క ముఖాలు వేశారు ప్రభాస్ అభిమానులు ఈ సినిమా చూసి...! పొరపాటు ఎక్కడ జరిగింది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెగ్యులర్ గా లారెన్స్ చేసేదే కాకపోతే ఈ సారి కాలం కలిసి రాలేదు. అయినా సందర్భం డిమాండ్ దృష్ట్యా మనము చర్చించుకోవాలి.
నృత్య దర్శకుడిగా లారెన్స్ కున్న ప్రతిభ అపారం , అలానే టేకింగ్ విషయంగా కూడా కొంతవరకు పరవలేదనిపిస్తాడు. కాని కధ , కధనాల విషయంలో మాత్రం ఎప్పుడు పూరే...! ఒక్క 'స్టైల్' సినిమా మినహా ప్రతి సినిమాలోనూ ఈ లోపం కనపడుతుంది. లోపం ఉన్నప్పటికీ మాస్ కు కావలసిన డాన్సులు, ఫైట్లు దిట్టంగా పెట్టి నెట్టుకొచ్చేవాడు. కాని ఈ రెబెల్ లో ఆ అంశాలు సరిగా పేలక పోవటంతో అసలుకే ఎసరువచ్చింది. అంతే కాకుండా టేకింగ్ పరంగా కూడా లారెన్స్ వైపు నుండి కొంత నిర్లక్ష్యం కనపడింది. ఎందుకంటే అతని సినిమాలో మొత్తం కాకపోయినా కొన్ని ఎమోషన్ సన్నివేశాల వరుకన్న బాగా చిత్రీకరించేవాడు. కాని ఈ సినిమాలో అవసరం, అవకాశం ఉన్నప్పటికీ చాల సన్నివేశాల్లో ఎమోషన్ ను పండించలేక పోయాడు. అంతే కాకుండా స్వతహాగా కొరియోగ్రాఫర్ అయ్యుండి కూడా తమన్నా ఇంట్రడక్షన్ సాంగ్ మినహా మరే పాటలోను తన ప్రత్యేకతను ప్రదర్శించలేదు.
'రెబెల్' ఒక ఆసక్తి కలిగించే మర్డర్ ఎపిసోడ్ తో మొదలవుతుంది. ఆ ఫై దర్శకుడు హీరో ను కూల్ గా ఇంట్రోడుస్ చేసి అంతే కూల్ గా సినిమాను నడిపించటం మొదలు పెడతాడు. తరవాత బ్రమ్మి, కోవై సరళ రెగ్యులర్ రొటీన్ కామెడీ సన్నివేశాలతో ఇంటర్వెల్ వరకు నడుస్తూ ప్రేక్షకులకు కొద్దిగా అసహనాన్ని కలిగిస్తుంది. కాని ఇంటర్వల్ బ్యాంగ్ ఊహించని విధంగా ఉండి థ్రిల్ చేస్తుంది. కాని ఆ ఉత్సాహం అక్కడితోనే ముగిసిపోతుంది. రెండో సగం మొదలైన దగ్గర నుండి మనకు తెలియకుండానే సినిమాతో కనెక్షన్ కొల్పొతూఉంటాం...! మద్యలో ఒకటి అర ఫైట్లు ఆశ పెట్టినప్పటికీ కధతో కనెక్షన్ ఉండదు కాబట్టి పెద్దగా ఎంజోయ్ చేయలేం. క్లామక్స్ లో హీరో విలన్స్ కొట్టుకోవటం చూడటానికి బానే ఉంది కానీ లాజిక్ విషయంగా వెటకారంగా తోస్తుంది. మొత్తంగా సినిమా నిరాశ పరుస్తుంది.
దర్శకుడిగా లారెన్స్ రాణించలేకపోయాడు. సినిమాకే ఆయువు పట్టులాంటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను పేలవంగా రూపొందించాడు. మొదటి సారి కృష్ణంరాజు, ప్రభాస్ నాన్న కొడుకులుగా నటిస్తున్నారంటే ఎంతో ప్రత్యేకంగా ఊహించుకుంటారు అభిమానులు. కాని ఆ విషయం మీద లారెన్స్ శ్రద్ద పెట్టినట్టే కనిపించదు. సన్నివేశాలే కాదు హీరో తో సహా ఏ ఒక్క పాత్రను ఆకట్టుకునేట్టు తీర్చిదిద్దలేదు. ఆయన స్వరపరచిన పాటలు కూడా పెద్దగా మెప్పించలేక పోయాయి. చిన్నా అందించిన బ్యాక్ స్కోరు క్యాచిగా లేదు. డార్లింగ్ స్వామి మాటలు పేలవంగా ఉన్నాయి. చాలా సన్నివేశాల్లో నాన్ సింక్ డైలాగులు వ్రాసి తన అసమర్ధతను చాటుకున్నాడు. కధ రీత్యా మాటల్లో ఉండాల్సిన పవర్, కమాండ్ ఎక్కడ కనిపించదు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది . నిర్మాణాత్మక విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్రభాస్ దర్శకుల నటుడు ... ఎంత వాడుకుంటే అంత కనపడతాడు. దర్శకుడు ప్రభాస్ ను పూర్తిగా వినియోగించుకోలేదు. పై పెచ్చు ప్రభాస్ లోని కామెడీ యాంగిల్ ను కొత్తగా చూపించాలని ట్రై చేసాడు కాని అందులో క్లారిటి లేకపోవటం మూలంగా ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. మొత్తంగా ఈ సినిమా ఓ సంవత్సరం తరవాత ప్రభాస్ ను గుర్తు చేసుకున్నాం... అన్నట్టు ఉంటుందేకాని... ఎప్పటికి గుర్తుపెట్టుకునే సినిమాగా మాత్రం ఉండదు. ఇక పొతే ఈ సినిమా వల్ల ఎవరికీ లాభం ఉన్నా లేక పోయిన తమన్నాకి మాత్రం బోలెడంత లాభాన్నితెస్తుంది. ఈ సినిమాలో అమ్మడి డాన్సులు చూస్తే మరో నాలుగైదు సంవత్సరాలు కాల్షీట్ లు ఖాళి లేనంత బిజీ అయిపోవటం ఖాయం అనిపిస్తుంది. నటనకు స్కోప్ తక్కువ ఉన్నప్పటికీ అవకాశం ఉన్న మేర శక్తి వంచన లేకుండా ఎంటర్ టైన్ చేసింది.
దీక్షా సేథ్ తన పరాజయాల పరంపరను నిరాటంకంగా కొనసాగిస్తుంది. ఏ విధమైన మార్పు లేకుండా తన భయంకరమైన నటనతో జనాలను ఈ సినిమాలో కూడా బయపెట్టింది. కృష్ణంరాజు రెబెల్ గా హుందాగా నటించారు. అయన చేసిన ఫైట్స్ రెబెల్ స్టార్ అభిమానులకు పాత రోజులను గుర్తుకుతెస్తాయి. బ్రహ్మానందం, కోవై సరళ కామెడీ కొద్దిగా ఇబ్బందిగా అనిపించినప్పటికీ నవ్విస్తుంది. ప్రదీప్ రావత్ , ముఖేష్ రుషి, సుప్రీత్ తదితరులు వారి పాత్రలకనుగుణంగా బాగా నటించారు.
ప్లస్ పాయింట్స్ :
ఇంటర్వల్ బ్యాంగ్ , తమన్నా ప్రధానంగా ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్.
మైనస్ పాయింట్స్:
కధ , కధనం, మాటలు, సంగీతం, దర్శకత్వం ప్రధానమైన లోపాలు ఈ సినిమాకు.
కొసమెరుపు :
బిల్లా తరవాత నాలుగు సంవత్సరాలుగా వెజిటేరియన్ మీల్స్ తో సర్దుకు పోతున్న ప్రభాస్ అభిమానులు ఏంతో ఆశగా ఎదురు చూసిన నాన్ - వెజ్ మీల్స్ 'రెబెల్' కారం, మసాలలా కొలతలు కుదరక నిరాశపరిచింది. 'ఏ ' సెంటర్స్ లో పెదవి విరుపులు వినపడుతున్నప్పటికి , 'బి' 'సి' లలో రెబెల్ కు పట్టు దొరకపుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి . ఇక ఈ సినిమా భవితవ్యం 'మాస్ ' మహారాజుల మీదే ఆధారపడి ఉంది.
ప్రతి సినిమాకు విడుదలకు ముందు కొన్ని అంచనాలు ఉంటాయి. అందులోను ప్రభాస్ లాంటి హీరో ఉన్నమాస్ సినిమా అంటే అంచనాలకు హద్దు, పొద్దు ఉండదు. యేడాదిన్నార పాటు చడి చప్పుడు లేకుండా షూటింగ్ చేసుకున్న ఈ సినిమా మొదటి టిజర్ విడుదలతో అందరి దృష్టిని ఆకర్షించింది. కాని తరవాత విడుదలైన పాటలు కొంత నిరాశపరిచినప్పటికీ లారెన్స్ కాబట్టి పాటలు వినటానికి ఓ మాదిరిగా ఉన్నా .. చూడటానికి అదరగొట్టి ఉంటాడులే అని సర్దిపెట్టుకున్నారు. పాటల సంగతి పక్కన పెడితే ఈ సినిమాలో వీర మాస్ అంశాలు వీపరీతంగా ఉన్నాయని సినిమాను చూసిన కొంతమంది చెబుతున్నారు. రెబెల్ లో 10 నుండి 12 వరకు ఒళ్లుగగుర్పోడిచే యాక్షన్ సన్నివేశాలున్నాయని, క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ అయితే ఫైటింగులకే తాతలా ఉందనీ ... యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ 'రెబెల్ ' మళ్ళి వచ్చిన బోనాల్ జాతర అని చెప్పుకొస్తున్నారు. కాకపోతే ఈ రిపోర్ట్ ను పూర్తిగా నమ్మటానికి వీలులేదు. ఎందుకంటే ఇప్పుడు సినిమాను చూసేవాళ్ళు హీరోకు , నిర్మాతలకు అనుకూలంగా ఉండే వాళ్ళు. దాదాపు వాళ్ళ రిపోర్ట్ పాజిటివ్ గానే ఉంటుంది. అసలు సంగతి రేపు కాని తెలియదు.
ఏదేమైనప్పటికీ కొన్ని అంశాలు సినిమా మీద ఆసక్తిని నిలబెడుతున్నాయి. ముఖ్యంగా లారెన్స్ చిత్రీకరణ స్టైల్, అయన వేయించే స్టెప్పులు ప్రధానమైన ఆకర్షణలు. మాస్ కు ఏమికావాలో నాకు తెలుసు అని ప్రకటించిన లారెన్స్ రెబెల్ ను మాస్ మయం చేసాడు. చివరికి ముద్దులు కుడా మాస్ గానే పెట్టించాడు.
తమన్నాను ఎలా చూపిస్తే మాస్ కు నచ్చుతుందో... అలానే చూపించాడు.
ఇక ప్రభాస్ గురించైతే చెప్పనే అవసరం లేదు.... ఛత్రపతి ని గుర్తుకుతెస్తున్నాడు. ఇవన్నీ సినిమాకు ప్లస్ లు. ఎంత వద్దనుకున్న కొన్ని మైనస్ లు తప్పకుండా ఉంటాయి.... !
రెబెల్ కి ముప్పు కధ , కధనాల నుండి పొంచి ఉంటుంది. ఏలనంటే.... గత చిత్రాల అనుభవం దృష్ట్యా మన రాఘవ లారెన్స్ లాజిక్ ను విడిచి మ్యాజిక్ మీద స్వారి చేస్తాడు అన్నది సత్యం. అందుకు నిదర్శనం నిన్న వచ్చిన ట్రైలర్ లో.... రెండేళ్ళు ఉపవాసం ఉన్న పులి డైలాగ్, దానిని ప్రభాస్ చెప్పిని తీరు లాజిక్ అనే మాటను చిన్నాభిన్నం చేశాయి . Rebel Dialogue Trailer కధ విషయానికి వస్తే 'ఓ మంచి డాన్ కు కొడుకైన హీరో తండ్రి మరణంతో రెబెల్ గా మారి ప్రతినాయకుల భరతం పడతాడు అని కొందరు చెబుతుంటే... ప్రేమించిన అమ్మాయిని చంపినా వాళ్ళ ఫై పగ తీర్చుకోవటానికి రెబెల్ గా మారతాడు అని కొందరు వినిపిస్తున్నారు. రెంటిలో ఏదైనప్పటికీ కధ రొటీన్ అండ్ సింపుల్ అని అర్ధం అవుతుంది. ఇక ఆశలన్ని లారెన్స్ మాస్టర్ టేకింగ్ మీదే...!
ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమా ఫై ఉన్న అంచనాల ప్రకారం ఛత్రపతి రేంజ్ కి కొద్దిగా దగ్గరగా అనిపిస్తే చాలు రెబెల్ సూపర్ హిట్ అవటం ఖాయం. ఎందుకంటే మాస్ జనాలు వీర భీభత్స మాస్ సినిమా కోసం మొహం వాచీ పోయి ఉండటం ఒక కారణం అయితే.... కెమెరామాన్ గంగతో రాంబాబు సినిమా వచ్చే వరకు మరో పెద్ద సినిమా లేకపోవటంతో మూడు వారలు దియేటర్ లు అపుకునే అవకాశం ఉండటం మరో కారణం. ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా బాక్స్ ఆఫీసుల దగ్గర రెబెల్ సందడి మొదలైంది. మరి ఈ సందడి ఎన్నాళ్ళు కొనసాగుతుందో.... రేపు తేలుతుంది.
రఫ్ అండ్ టఫ్ గా ఉండే జూనియర్ యన్ టి ఆర్ రాజకుమారిడిలా తయారైయ్యాడు. స్టైలిష్ లుక్ లో, వెరైటి హెయిర్ స్టైల్ తో, వెల్ దిజైన్డ్ కాస్ట్యూమ్స్ తో చాలా క్యుట్ గా కనిపిస్తున్నాడు. మొత్తానికి శ్రీను వైట్ల ఒక కొత్త యన్ టి ఆర్ ను ప్రేక్షకులకు చూపించటానికి కష్టపడుతున్నాడని అర్ధం అవుతుంది. శ్రీను తన పుట్టిన రోజు స్పెషల్ గా ఈ ట్రైలర్ తో యన్ టి ఆర్ అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చాడు. యన్ టి ఆర్ ఈ సినిమాలో పెద్ద డాన్ పాత్రలో నటిస్తున్నట్టు అనిపిస్తుంది. ట్రైలర్ లో కనిపించిన వాతావరణం అందుకు తగ్గట్టుగానే కనిపిస్తుంది . బ్యాక్ స్కోరు డాన్ సినిమాను గుర్తుకుతెస్తుంది. అలానే ముకేష్ రుషి, ఆశిష్ విద్యార్ధి, కిల్లి దోర్జీ, ఆదిత్య వంటి నలుగురు ప్రముఖ విలన్స్ కనిపిస్తున్నారు. చివరిలో డైలాగ్ 'బాద్షా డిసైడ్ అయితే వార్ ఒన్ సైడ్ అయిపోద్ది...!' ఆ రోల్ కెపాసిటీ ఎంటో తెలియజేస్తుంది. అలానే ట్రైలర్ లో 'The Privilege For Gentleman' అని ఉంది. అంటే 'బాద్షా అనే వ్యక్తీ జంటిల్ మాన్ అనే పదానికి దక్కిన అరుదైన గౌరవం' అని అర్ధం వస్తుంది. అది ఎంత వరకు అనేది వెండితెర మీద చూడాల్సిందే...! ఇకపోతే ఈ ట్రైలర్ లో మనకు కనిపించింది సినిమాకు ఒక వైపే... మరో వైపు శ్రీను వైట్ల మార్క్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది కాదా...! అందుకోసం కూడా వైట్ల ఈ సినిమాలో అన్ని ఏర్పాట్లు ఘనంగానే చేసినట్టు సమాచారం.
'బాద్షా డిసైడ్ అయితే వార్ ఒన్ సైడ్ అయిపోద్ది...!' అన్నట్టుగానే శ్రీను వైట్ల డిసైడ్ అయితే ఎంటర్ టైన్ మెంట్ వరదలై పారుద్ది..! అన్న సంగతి మనందరికీ తెలుసు కాబట్టి ఆసక్తిగా బాద్షా కోసం వేచి చూద్దాం ...!
స్టైల్ గా కనిపించటం .... వెరైటీ గా అనిపించే గమ్మతైన వేషదారణతో తన అభిమానులను కట్టి పడేయటం పవన్ కళ్యాణ్ కు అలవాటు. ఈ విషయమే ఆయనకు ఎందఱో వీరాభిమనులను సంపాయించిపెట్టింది. ప్రతి సినిమాలోనూ ఏంతో కొంత కొత్తగా కనిపించి... సరికొత్త స్టైల్ ను యువతకు పరిచయం చేసే పవన్ త్వరలో రాబోయే 'కెమెరామన్ గంగతో రాంబాబు ' చిత్రంలో ఏమి కొత్తదనాన్ని పరిచయం చేయబోతున్నాడో అని పవన్ ఆరాధకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కాని పరిస్థితి చూస్తుంటే ఈ సినిమాలో పవన్ కొత్తదననికంటే సింప్లిసిటీకే ఎక్కువ ప్రాదాన్యత ఇచ్చినట్టు కనపడుతుంది. ఏమో.... ఈ సింప్లిసిటీయే రేపు మరో స్టైల్ అవుతుందేమో ఎవరు చెప్పొచ్చారు.... ! అసలే పవన్ ప్రదర్శించే విన్యాసాలను చూసి జనాలు ఎందుకు బానిసలైపోతారో.... ఎవరికీ అర్ధంకాని నిజం. ఇక పొతే అసలు విషయంలోకి వస్తే ఇప్పటివరకు రెండుసార్లు బద్రి , అన్నవరం చిత్రాలలో కౌబాయ్ గెటప్స్ లో కనిపించి అలరించిన పవన్ ఈ సినిమాలో కూడా ఓ పాటలో కౌబాయ్ గెటప్ లో తమన్నతో కలిసి డాన్సు చేసి ఎంటర్ టైన్ చేయనున్నాడు. పద్మాలయ స్టుడియోలో షూటింగ్ జరుపుకుంటున్న ఆ పాటకు సంబందించిన స్టిల్ల్స్ బయటకు వచ్చాయి . చూడటానికి ఆకర్షణియ్యం గా కనిపిస్తున్న ఈ పాటలో ఉన్న సిసలైన మజా ఏమిటో.... అక్టోబర్ 11 న తెలియనుంది.
తెలుగు సినిమాలో స్టార్ హీరో అంటే సాహసానికి మారుపేరు అన్న పంధాకి కామా పెట్టి స్టార్ లో నటుడు కూడా ఉంటాడు అని అన్నమయ్య, రామదాసు చిత్రాలతో నిరూపించిన కింగ్ నాగార్జున తనలోని నటుడికి పరిపూర్ణత చేకూర్చటానికి సాయి బాబా గా షిరిడి సాయి అనే చిత్రం లో నటించాడు. ఆ చిత్రం ఈ వారం మన ముందుకు వచ్చింది. సాయి కృప ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై ఎ . మహేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకుడు. శ్రీకాంత్, శ్రీహరి, శరత్ బాబు, కమలిని ముఖర్జి తదితరులు ఇతర ప్రధాన పాత్రలలో కనిపించారు . కీరవాణి తన బాణీలతో సాయిబాబాను సేవించగా పరుచూరి బ్రదర్స్ మాటలతో పూజించారు. దర్శకుడిగా రిటైర్మెంట్ స్టేజ్ లో ఉన్న రాఘవేంద్ర రావు ఇప్పటివరకు తానూ రూపొందించిన అన్నమయ్య , శ్రీరామదాసు సహా ప్రతి సినిమాలో శృంగారానికి ప్రత్యేక స్థానం ఇస్తూ వచ్చాడు. కాని తన కెరీర్ లోనే మొదటిసారి శృంగారానికి అవకాశం ఇవ్వకుండా 'షిరిడి సాయి' సినిమాను రూపొందించటం విశేషంగా చెప్పుకుంటున్నారు ఫిలింనగరవాసులు. స్వామి అనుగ్రహం కోసం పరితపించే భక్తుడిగా రెండు సార్లు తెలుగు ప్రేక్షకులను అలరించిన నాగార్జున భగవంతుడిగా ఎలా ఆకట్టుకుంటాడో.... అని ఈ సినిమా కోసం సిని వర్గాలతో పాటు సామాన్య ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఫైకి ఎంత భక్తిరస చిత్రం అని చెబుతున్నా సినిమా రుపకర్తల అసలు ఉద్దేశం రాబడే కాబట్టి సినిమాలోని తప్పొప్పులను చర్చించక తప్పని పరిస్థతిని దృష్టిలో పెట్టుకుని ఈ 'షిరిడి సాయి' ఆయనను ఆరాధించే భక్తులకే పరిమితం అయ్యిందో...లేక అందరిని ఆకట్టుకునేట్టు ఉందో..... సమీక్షలో చూద్దాం . కధ : చెడును అంతమొందించి , మంచిని ప్రోత్సహించి, ఆదర్శప్రాయమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడిపే విధంగా మనిషిని మేల్కొల్పెందుకు భగవంతుడు వివిధ కాలాలలో వివిధ రూపాలలో అవతరించాడు , మానవులను సంస్కరించాడు. వారిలో ఎందఱో దేవుళ్ళు పురాణాల్లో , పుస్తకాల్లో , కధల్లో మాత్రమే వినిపించారు, కనిపించారు. కాని సమకాలికంగా ఒక మహానుభావుడు ప్రత్యక్షంగా మనుషులతో మమెకమై శ్రద్ద, సబూరి తో జీవితాన్ని పరమపావనం చేసుకోవచ్చని భోదించి కోట్లమంది భక్తుల గుండెల్లో దైవంగా కొలువుదీరాడు. అలాంటి ఆ సాయిబాబా సత్చరిత్రకు మరో తెర రూపమే ఈ 'షిరిడి సాయి'. సాయి జననం, షిరిడి ఆగమనం, అక్కడవారి జీవితాలను ప్రభావితం చేయటంతో పాటు బాబా జీవన గమనంలోని కొన్ని ముఖ్య అంశాలను స్పృశిస్తూ ఆయన మహా సమాధి వరకు సాగుతుంది ఈ షిరిడి సాయి చిత్రం. విశ్లేషణ: 'షిరిడి సాయి ' సినిమా గురించి చెప్పాలంటే సాయి బాబాను దేవుడిగా గుర్తిస్తూ... అయన గురించి పెద్దగా తెలియని వారికీ బాగానే ఉండొచ్చు కాని బాబాను మనస్పూర్తిగా ఆరాదిస్తూ .... అయన గురించి పూర్తీ అవగాహన ఉన్నా వారికీ ఈ సినిమా ఒక సాదారణ చిత్రంలా కనిపిస్తుంది. అంతే కాకుండా పాత 'షిరిడి సాయి మహత్యం' సినిమాను మనసులో పెట్టుకుని ఈ సినిమాను చూస్తే మాత్రం నిరాశ పడటం ఖాయం. వేలెత్తి చూపిస్తున్నాం అని కాదు కాని పాత సినిమాలో ఉన్నంత వివరణ కాని , అనుభూతి కాని , తన్మయత్మం కాని ఈ ఈ సినిమాలో కనపడవు. సినిమా ప్రచారంలో భాగంగా ఇంతకు ముందు చూడని బాబా జీవితంలోని విశేషాలను చూపెడుతున్నాం అని చెప్పారు. కాని అందుకు తగ్గట్టు అవసరమైన పరిశోధన మాత్రం చేసినట్టు కనిపించలేదు.
నిజంగా బాబా గురించి చెప్పాలనుకుంటే సాయి భక్తులకు బాబా సమానమైన 'సాయి సత్చరితం ' గ్రంధాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే సరిపోతుంది. అందులోని బాబా తత్త్వం , లీలలు మనిషిగా అవతరించిన మహానుభావుడి అంతర్యాన్ని తెలియజేస్తాయి. వాటిని విశాలమైన మనసుతో కధ గా కూర్చుకోగలిగితే.. ఒకటి కాదు 100 సినిమాలకు సరిపడ కధలను రూపొందించుకోవచ్చు. అనంతమైన ఆద్భుత విశేషాల సమాహారం బాబా జీవితం.
కానీ ఈ సినిమా రుపకర్తలలో బాబా మీద నమ్మకం కంటే సినిమాను కమర్షియల్ ఫార్ములా ప్రకారమే రూపొందించాలి అన్నా సంకుచిత భావమే కనిపించింది. బాబా దేవుడు ..... హీరో కాదు...! కాని ఆయనను ఒక సినిమా హీరోగా చూపించే ప్రయత్నం ఈ సినిమాలో జరిగింది. అందుకోసం ఫుల్ మూవీ రోల్ ఉన్న బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడే భాటియా అనే ఒక విలన్ , అతనికి ఇద్దరు కామెడీ చేసే అనుచరులు, వారు చేసే వెటకారం వెరసి సినిమా సాదారణ సినిమాలా అనిపిస్తుంది.
ఇక్కడ రెండు విషయాలు చెప్పుకోవాలి. ఒకటి బాబా జీవన గమనంలో ఆయనను ఎందఱో ఎన్నో రకాలుగా శంకించి... పరీక్షించి ఆయన మహిమలను అనుభవించి పరమ భక్తులుగా మారిపోయారు. కాని ఈ సినిమాలో భాటియా మాత్రమే మొదటి నుండి చివరి వరకు బాబాను పలురకాలుగా అవమానపరచటానికి ప్రయత్నాలు చేస్తూ భంగపడతాడు . అదీ ఎంతలా అంటే బాబా పాత్ర కంటే భాటియా పాత్రే ప్రేక్షకుల మైండ్ లో ఫిక్స్ అయ్యేలా...!
ఇక రెండో విషయం ఏమిటంటే సినిమా దర్శక రచయతలు ప్రేక్షకులను, వారి అభిరుచిని తక్కువగా చూడటం..! ప్రేక్షకులు దేవుడు సినిమాను చూడటానికి భక్తీ భావంతో వస్తారు... అదే సినిమాలో ఆశిస్తారు కూడా..! అలాంటిది వెటకారపు సన్నివేశాలతో చీప్ కామెడీని సృష్టించటం ప్రేక్షకులను తక్కువ చేసి చూడటమే అవుతుంది. ప్రత్యేకంగా చెప్పకపోయిన కమర్షియల్ అంశాలు లేక పొతే జనాలు సినిమా చూడరు అనే సంకేతం ఇవ్వటం వారిని అవమానపరచటమే...!
అలానే బాబా మహిమలను యధార్దానికి దూరంగా, కొంత నాటకీయతను జోడించి చిత్రీకరణ సౌలభ్యం కొరకు కలగపులగం చూపించారు. దాంతో సినిమాకు అవసరమైన ఫీల్ పండక కృత్రిమంగా అనిపిస్తుంది. కాని చివరి పావుగంట... అంటే బాబా అంత్యదశను మాత్రం బాగా చిత్రీకరించారు. ఆ కాసేపు కలిగిన భావమే సినిమా అంత ఉన్నట్టయితే తప్పక జనరంజక చిత్రం అయ్యేది. మొత్తంగా మాత్రం ఈ 'షిరిడి సాయి' ఒక అసంపూర్ణమైన అనుభవం.
మాస్ చిత్రాల రారాజులుగా వెలుగొందుతున్న రచన ద్వయం పరుచూరి సోదరురుల సంభాషణలు బాబా తత్వాన్ని, బోధనలను తగు రీతిలో ప్రేక్షకులకు చేరువ చేయలేకపోయాయి. కీరవాణి అందించిన బాణిలలో 3 పాటలు మినహా మిగతావి పెద్దగా ఆకట్టుకోలేదు. బ్యాక్ స్కోరు కూడా చెప్పుకునేట్టు లేదు. యస్ గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఉన్నతంగా ఉంది. నిర్మాణాత్మక విలువలు పర్వలేదనిపిస్తాయి.
నాగార్జున బాబాగా రాణించలేక పోయాడు. భయమో, గౌరవమో... మరేదైనా కావొచ్చు.... బాబా పాత్రలో నాగార్జున లీనమైనట్టు కనిపించలేదు. సాయి బాబాగా డైలగుల్లోను , ఆహార్యంలోను మరింత పరిణితి పదర్శించవలసిన అవసరం కనిపించింది. కాని క్లైమాక్స్ లో మాత్రం తన శైలిలో నటించి మెప్పించాడు. భాటియగా షాయాజీ షిండే , అతని అనుచరులుగా ఆలీ, అనంత్ నటన కొన్నిసార్లు ఎబెట్టు కలిగించింది. వేల్స్ దోరగా శ్రీహరి ఆకట్టుకున్నాడు. శ్రీకాంత్ తన పాత్రకు న్యాయం చేశాడు. ఉంటానికి పెద్ద పెద్ద నటులే ఉన్నప్పటికీ ఏ ఒక్కరి పాత్ర ఆకర్షణియ్యం గా కనిపించదు.
ప్లస్ పాయింట్స్ :
కీరవాణి స్వరపరిచిన పాటలు, క్లైమాక్స్ కొంత వరకు సినిమాకు ప్లస్ పాయింట్స్.
మైనస్ పాయింట్స్:
మహత్యం తక్కువైన కధ , అనుభూతి లేని కధనం , నాసిరకం కామెడీ ప్రదానంగా మైనస్ పాయింట్స్
కొసమెరుపు:
షిరిడి సాయి సినిమాకు అయిన బడ్జెట్ ను , విడుదలకు ముందు జరిగిన ప్రచారంతో పోల్చుకుంటే కమర్షియల్ గా సేఫ్ ప్రాజెక్ట్ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి ...! కాని ఎన్ని మాట్లాడుకున్న సినిమా ఫలితానికి సంబంధించి అంతిమ తీర్పు జనాలదే ...! సోమవారం నాటి కలెక్షన్లను చూస్తే మిశ్రమ స్పందన కనపడుతుంది. ఆఫై ఫలితం బాబా చేతిలోనే ఉంది.
కృష్ణ వంశీ కృషి కారణంగా శ్రీ ఆంజనేయం సినిమాతో తెలుగు తెర ఫై తన అందాల విందును ప్రారంబించిన పంజాబీ బొద్దుగుమ్మ ఛార్మి తన టాలెంట్ తో కొంత కాలం తెలుగు ప్రేక్షకులను ఒక ఊపు ఉపింది. కాని అమ్మడి దురదృష్టంకొద్ది పెర్ఫార్మన్స్ కు అవకాశం ఉన్నా పాత్రలకంటే గ్లామర్ వెదజల్లే పాత్రలే ఎక్కువ వచ్చాయి. దాంతో రోజు ఒకే రకం భోజనం ఎన్నాళ్ళు తినగలరు అన్న సిద్దాంతం ప్రకారం తెలుగు అగ్ర దర్శకులకు, అదిక శాతం ప్రేక్షకులకు తొందరగానే దూరం అయ్యింది.
అందుకు నిదర్శనం 2002 లో కెరీర్ మొదలు పెట్టిన ఈ బబ్లి గర్ల్ 2004 లో శ్రీ ఆంజనేయం చిత్రంతో ట్రాక్ లో పడింది, ఆ తరవాత కేవలం సంవత్సరాలలో దాదాపు అందరు పెద్ద హీరోలతో నటించిన, 2006 లో రాఖి తరవాత ఇప్పటి వరకు అగ్ర నటుడితో నటించే మరో అవకాశాన్ని దక్కించుకోలేకపోయింది. మద్యలో మంత్ర , మంగళ చిత్రాలతో కొంత గుర్తింపు తెచ్చుకుంది కాని ఒక వర్గం ప్రేక్షకులనే మెప్పించగలిగింది. చివరికి ఈ చిన్నదాన్ని ప్రోత్సహించే నాగార్జున కూడా ఐటెం సాంగ్స్ వరకే పరిమితం చేసాడు.
కాని 'రగడ' తరవాత అలాంటి అవకాశాలు కూడా ఛార్మికి ఎదురవటం మానేశాయి. అలా నిరాశగా సాగిపోతున్న ఆమె కెరీర్ లో తాజాగా 'డమరుకం' రూపంలో కొత్త ఆశలు చిగురించాయి. పుణ్యం ఎవరిదైన కాని చార్మికి 'సక్కుభాయి' ఐటెం సాంగ్ అనే వరం దొరికింది. ఇప్పుడు ఈ అవకాశాన్ని 200 % సద్వినియోగపరుచుకోవటానికి సిద్దం అయ్యింది. అందుకోసం ఓ పక్క సెట్స్ లో శక్తికి మించి కష్టపడుతూనే మరో పక్క అవకాశం మేర ఈ విషయాన్నీ అన్ని మార్గాల్లో విపరీతంగా ప్రచారం చేస్తుంది.
అందులో భాగంగా ఈ మద్య 'కెవ్వు కేక ' పాటతో తెలుగు ప్రేక్షకులను ఊర్రుతలుగించిన దేవి శ్రీ ఈ 'సక్కుబాయి' పాటను కూడా ఆ రేంజ్ లో రూపొందించాడని గొప్పగా చెప్పుకుంటుంది. తను 'మనీ' అని ముద్దుగా పిలిచే నాగ్ తో వేసే స్టెప్పులు బాగుంటాయని చెబుతూనే .... ఈ పాటలో కొత్తగా కనిపించే తన రూపం.... సరికొత్త మొమెంట్స్ ప్రత్యేకంగా మీ కోసం అని జనాలను ఊరిస్తుంది. అంతే కాకుండా 'ఉందిలే మంచి కాలం ముందు ముందునా ...' అంటూ పాడుకుంటూ..... ఈ పాటతో తన కెరీర్ కు మంచి మలుపు దొరుకుతుందని బోలుడన్ని ఆశలు పెట్టుకుంది. అలా ఎంతో నమ్మకంగా ఛార్మి నిర్మించుకుంటున్న ఈ ఆశల నావ ఏ తీరం చేరుతుందో తెలుసుకోవటానికి అక్టోబర్ వరకు ఆగాల్సిందే.....!