'డీ' సినిమా తరవాత ఆ రేంజ్ విజయం సంగతి పక్కనుంచి పర్వాలేదు అని అనిపించుకోవటానికే ముఖం వాచిపోయిన మంచు విష్ణు ఈసారి సక్సెస్ సాదించటానికి 'దేనికైనా రెడీ ' అంటూ దసరా పండగ పూట దియేటర్లకు వచ్చాడు. విష్ణు కెరీర్ గ్రాఫ్ దృష్ట్యా సినిమా మీద పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ చివరి నిమిషంలో చెలరేగిన సెన్సార్ వివాదంతో కొంత జనాల అటెన్షన్ ను దక్కించుకుంది. అలానే తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఫాం లో ఉన్న రచయతలు తలో చేయి వెయ్యటం సినిమా ప్రచారానికి కొంత ఉపయోగపడింది.
ఇలా కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నప్పటికీ మంచు వారి సినిమా అనగానే ఈ మద్య వారి నుండి వచ్చిన సినిమాల అనుభవం కారణంగా కొన్ని అనుమానాలు ఉండటం సహజమే..! కాని ఆ అనుమానాలు మీరు సినిమా హాల్ లోకి ప్రవేశించే వరకు మాత్రమే ఉంటాయి. ఆ తరవాత మీరు ఒక సీరియస్ పనిలో పడిపోతారు. అదేమిటో... ? ఎందుకలాగా జరిగిందో...? మన సమీక్షలో చూద్దాం .
కధ :
రాయలసీమ ప్రాంతంలోని కపట్రాల అనే ఊరులో నరసింహనాయుడు (ప్రభు) పెద్ద ఫాక్ష్యనిస్ట్. అతని చెల్లెలు సరస్వతి (సీత), బాషా (సుమన్) ముస్లిం ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఆ భాధతో వారి తండ్రి చనిపోతాడు. దాంతో నరసింహనాయుడు బాష కాలు నరికేస్తాడు. అప్పటినుండి ఆ రెండు కుటుంబాల మద్య గొడవలు నడుస్తూ ఉంటాయి. 22 సంవత్సరాల తరవాత సరస్వతి కొడుకు సులేమాన్ (విష్ణు) అమ్మ సంతోషం కోసం ఆ రెండు కుటుంబాలను కలపటానికి పూనుకుంటాడు.
అందుకోసం కృష్ణ శాస్త్రి అనే బ్రాహ్మణుడిగా రూపు మార్చుకుని చండి యాగం చేసేందుకు నరసింహనాయుడి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అందుకు నరసింహ నాయుడి మేనేజర్ బంగారు రాజు (బ్రమ్మి) తన అజ్ఞానంతో సహకరిస్తాడు. ఆ ఫై ముస్లిం అయిన బ్రాహ్మణుడు ఆ ఇంట్లో చేసే అల్లరి. నిజం తెలుసుకున్న బంగారు రాజు పడే టెన్షన్ సరదాగా ఉంటాయి. ఈ సందడిని కొనసాగిస్తూనే తన తెలివితేటలు ఉపయోగించి ఆ రెండు కుటుంబాలను సులేమాన్ ఎలా కలిపాడో... సినిమా చూసే తెలుసుకోవాలి.
విశ్లేషణ:
సినిమా మీద అనుమానాలు ఉంటే అది హాల్ లో కూర్చునే వరుకే అని ముందే చెప్పను ... ఆ తరవాత అందరు చేసే సీరియస్ పని ఏంటంటే ఏక బిగిన ఓ రెండు గంటల పాటు హాయిగా నవ్వుకోవటం. విష్ణు కూతుళ్ళు అరియానా వివియానా మొత్తానికి నాన్న కోసం అదృష్టాన్ని మోసుకోచ్చినట్టే ఉన్నారు. గత కొన్ని చిత్రాలుగా వీపరితంగా నిరుత్సాహపరుస్తున్న విష్ణు ఈ చిత్రంతో ఆ కొరతను తీర్చాడు. మూల కధను ఓ ఇద్దరు, అసలు కధను బి వి యస్ రవి వ్రాయగా దానిని కోన వెంకట్ , గోపీమోహన్ విస్తరించారు. ఆ ఫై మరుధూరి రాజా మాటలు వ్రాశారు . ఇలా ఉద్దండులందరూ నడుం బిగించటంతో సినిమా 'బాగుంది' అనే టాక్ ను సంపాయించుకుంది.
రచయతల శ్రమను బ్రాహ్మి,యం యస్ , ధర్మవరపు,ఎ వియస్ మాస్టర్ భరత్ తదితరులు భుజాన వేసుకుని సందు దొరికినప్పుడల్లా చెడుగుడు ఆడేస్తూ హాస్యపు వరద పరించారు. మనల్ని ఒకరి తరవాత ఒకళ్ళు వంతులు వేసుకుని మరి నాన్ స్టాప్ గా నవ్విస్తూనే ఉంటారు. ఇలా అందరిని సమన్వయ పరుస్తూ సినిమా ఎక్కడ బోర్ అనిపించకుండా ఆద్యంతం నవ్వుకునేలా రూపొందించి జి . నాగేశ్వర రెడ్డి కామెడీ చిత్రాల దర్శకుడిగా తన పేరును మరోసారి సార్ధకం చేసుకున్నాడు.
కధ పరంగా చూసుకుంటే రొటీన్ కధే కాని వినోదపు మయమైన కధనం కారణంగా కధ గురించి ఆలోచించే అవసరం రాదు. అలా అని నూటికో.. కోటికో.. వచ్చే ఆ ఒక్కటీ మాత్రం కాదు. ఇప్పడు ,మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫార్ముల అనిపించుకుంటున్న ట్రెండ్ ప్రకారం నడిచే మాములు కామెడీ ఎంటర్ టైనర్. కాకపోతే బోర్ కొట్టించని టైం పాస్ మరియు పైసా వసూల్ మూవీ. ఈ దసరాకు ఈ సినిమా ఒక నవ్వుల విందు మిస్ అవ్వకుండా ఆస్వాదించండి.
సాంకేతికత :
ఈ సినిమాకు రెండు ప్రధానమైన అంశాలు వెన్ను దన్నుగా నిలిచాయి. మరుధూరి రాజా మాటలు. కధనంలో వచ్చే మెలికలకు , మెరుపులకు తగురీతిన హాస్యాన్ని జోడించి సరదా సరదగా సాగిపోయే మాటలను వండి వడ్డించటం ఒక ప్రధాన అంశం అయితే, రెండవది ఆ వంటకాన్ని కడుపు పగిలేలా మన చేత తినిపించే హాస్య నటులు. ఇక మిగిలిన అన్ని విభాగాలు ఈ రెండు అంశాలకు సహాయ పడి వాటి ఉనికిని చాటుకున్నాయి తప్ప ప్రత్యేకతను చూపలేదు. పాటలు పర్వాలేదు. బ్యాక్ స్కోర్ ఓకే. నిర్మాణాత్మక విలువలు ఉన్నతంగా ఉన్నాయి. కాకపోతే ఒక షరా... 'మంచు' వారి సినిమాలన్నీ వారు ప్రత్యేకంగా నిర్మించుకున్న గందర్వ మహల్ చుట్టూనే తిరగటం ఇప్పటికైతే పరవాలేదు కాని ఇహ మీదట విసుగు పుట్టించవచ్చు.... గమనించవలెను.
అభినయం :
విష్ణు తన సహజ శైలిలో నటించి ఆకట్టుకున్నాడు. అతని డాన్సుల్లో కాస్తా ఈజ్ మిస్ అయినట్టు కనపడుతుంది సరి దిద్దుకోవాలి. హీరో పాత్ర ప్రకారం ఒక ముస్లిం అయ్యుండి హిందుగా నటించటం అనే ప్రత్యేకత మీద విష్ణు పెద్దగా శ్రద్ద పెట్టలేదు కాని కామెడీ ని మాత్రం టైమింగ్ ప్రకారం పండిచటంలో సక్సెస్ అయ్యాడు. అంతే కాని 'డీ'లో కనిపించినంత గొప్పగా అయితే కనిపించడు. ఏదేమైనా మొత్తంగా సినిమా విజయం తొలిగా హీరోకే దక్కుతుంది కాబట్టి విష్ణు హిట్ కొట్టినట్టే..! ఈ సినిమాలో హన్సిక పెర్ఫార్మెన్స్ కంటే గ్లామర్ గా కనిపించటానికే ఆసక్తి చూపినట్టు కనపడుతుంది. ఆ రకంగా చెప్పుకోవాల్సి వస్తే అమ్మడు తన భారి అందాలతో బాగానే ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమాకు అసలు హీరోలు బ్రామ్మి , యం యస్ అండ్ కో..! వాళ్ళెం చేసారో చెప్పటం కాదు సినిమాలో చూసి ఎంజోయ్ చెయ్యాలి. బ్రామ్మిది 'రెడీ' లో మేక్దోవాల్ మూర్తి తరహ పాత్రే అయినప్పటికీ తన కామెడీ టైమింగ్ లో ఉన్న ఎవర్ గ్రీన్ ఫ్రెష్ నెస్ తో మరోసారి కేరింతలు కొట్టించాడు. సంపంగి శాస్త్రి పాత్రలో యం యస్ బ్రామ్మి తో కలిసి సందడి చేశాడు . ధర్మవరపు, మాస్టర్ భరత్ మరియు వారి పండితుల గ్యాంగ్ చేసే అల్లరి గిలిగింతలు పెడుతుంది. ఎ వి యస్ , యల్ బి శ్రీరామ్ , రఘుబాబు తదితరులు సందర్భానుసారం చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. కాకపోతే వెన్నెల కిషోర్ నే సరిగా వాడుకోలేదు. ఎప్పటిలానే కోట విలన్ గా రాణించాడు. సుమన్ , ప్రభు, సీత తదితరులు వారి పాత్రలకనుగుణంగా బాగా నటించారు.
ప్లస్ పాయింట్స్:
వినోదాత్మకమైన కధనం , హాస్యపు జల్లు కురిపించే మాటల మతాబులు, బ్రమ్మి అండ్ కో చేసే కామెడీ ప్రధానమైన ప్లస్ పాయింట్స్ .
మైనస్ పాయింట్స్:
రొటీన్ కధ , హీరో హీరోయిన్ మద్య లవ్ ట్రాక్ సరిగా లేకపోవటం కొంతవరకు మైనస్ పాయింట్స్
కొస మెరుపు:
ఈ సెలవులలో కుటుంబ సమేతంగా వెళ్లి హాయిగా ఎంజాయ్ చేసే సినిమా గా ఈ 'దేనికైనారెడీ' ని చెప్పుకోవచ్చు. కాకపోతే ఒక సూచన ఈ సినిమాకు వెళ్ళే ముందు బాగా తినేసి వెళ్ళండి ఎందుకంటే రెండుగంటలు నాన్ స్టాప్ గా నవ్వలంటే ఆ మాత్రం ఎనర్జీ కావలిగా...! అలాగే కర్చీఫ్ కూడా మర్చిపోవద్దు... ఆనంద బాష్పాలు తుడుచుకోవల్సివస్తుంది అందుకు..!
మారుతీ టాకీస్ రేటింగ్ : 5 కి 3

No comments:
Post a Comment