హాస్య సినిమాల హీరోగా తెలుగు సిని ప్రేమికుల నవ్వుల సామ్రాజ్యాన్ని ఏలిన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తనలో ఇంకా ఇంకి పోకుండా మిగిలిఉన్న నటన తృష్ణను తీర్చుకోవటానికి వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ నేటి సమాజంలో అడుగంటి పోతున్న విలువలను జనానికి గుర్తు చేస్తున్నారు. అలాంటి సమాజ శ్రేయస్సు కోరే కధంశంతో ఆయన ప్రధాన పాత్రలో రూపొందిన 'ఓనమాలు' చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సన్ షైన్ సినిమా బ్యానర్ ఫై నిర్మితమైన ఈ చిత్రంతో క్రాంతి మాధవ్ దర్శక నిర్మాతగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. రాజేంద్ర ప్రసాద్ , కళ్యాణి జంటగా కనిపించగా చలపతిరావు,గిరిబాబు, రఘుబాబు తదితరులు ప్రధాన పాత్రలలో కనిపించారు . కోటి సంగీతాన్ని అందించగా తెలుగుదనం ఉట్టిపడేలా సీతారామశాస్త్రి సాహిత్యాన్ని కూర్చారు.
నిర్మాత కొత్తవాడు కావటం తో ఈ సినిమా ప్రస్తుతం తెలుగు సిని పరిశ్రమలో చిన్న సినిమాలు ఎదుర్కుంటున్న అన్ని కష్టాలను ఓనమాలు గా దిద్ది అనుభవం సంపాయించి మొత్తానికి విడుదల అయ్యింది. ఆ నలుగురు సినిమా తరవాత స్పూర్తి కలిగించే పాత్రలలో నటిస్తూ మెప్పిస్తున్న నటకిరీటి ఈ చిత్రంలో నారాయణ రావు మాస్టర్ గా ఓ సందేశాన్ని ప్రేక్షకుల చేత ఓనమాలు గా దిద్దించే ప్రయత్నం చేసాడు. మరి ఆ సందేశం సిని ప్రియులను ఏ మేరా ఆకట్టుకోగాలిగిందో......మన సమీక్షలో చూద్దాం .
కధ :
ఎన్నో ఏళ్లుగా అమెరికాలో కొడుకు దగ్గర ఉంటున్న నారాయణ రావు (రాజేంద్ర ప్రసాద్) మాస్టర్ కు తాను పుట్టి పెరిగిన పల్లెటూరు అంటే ఏంతో మమకారం. తీరికలేని యాంత్రికమైన జీవితాలతో కృత్రిమమైన ఆనందాలను అనుభవిస్తున్న కొడుకుకు మాస్టర్ ను సొంతూరుకు తీసుకు వెళ్ళే సమయం చిక్కదు. కొడుకును అడిగి... అడిగి.... విసిగి పోయిన మాస్టారు చివరికి చెప్పా పెట్టకుండా అమెరిక నుండి ఇండియా వచ్చేస్తాడు.
హైదరాబాద్ నుండి తన గ్రామానికి పయనమైన మాస్టారు ఆ ఊరితో తనకున్న అనుబంధాన్ని, అక్కడి పరిసరాలతో తనకున్న ఆప్యాయతను , ఊరి మనుషులతో తనకున్న అనురాగాన్ని, అవన్నీ ఇచ్చే స్వచ్చమైన ఆనందాన్ని జ్ఞాపకాలుగా నేమరువేసుకుంటాడు. జ్ఞాపకాలు ఇచ్చిన సంతోషంతో ఏంతో ఆశగా ఊళ్లోకి అడుగుపెట్టిన మాస్టారుకు అన్ని చెడు అనుభవాలు ఎదురవుతాయి.
ఒకప్పుడు తానూ ఉన్న ఊరికి ఇప్పుడున్న ఊరికి చాలా తేడా కనిపిస్తుంది. ఒకప్పటి ఆప్యాయత , అనురాగాల స్థానంలో స్వార్ధం, నిర్లక్ష్యం చేరి ఊరిని జీవచ్చవంలా తయారుచేస్తాయి. వీటన్నిటిని గమనించిన మాస్టారు ఊరి బాగు కోసం ఏమి చేసారు అన్నది మిగిలిన కధ .
విశ్లేషణ :
తెలుగు నేర్చుకోవటం ఓనమాలు తో మొదలవుతుంది. దేశ ప్రగతికి గ్రామాలే పట్టుకోమ్మలన్నారు పెద్దలు, నిజమైన దేశాభివృద్ధి గ్రామస్వరాజ్యంలో ఉంది అని నినాదించారు మహాత్మా గాంధీ . అలాంటి దేశ ఎదుగుదలకు 'ఓనమాలు' లాంటి గ్రామాలూ వీపరిత దోరణలకు దారి తీస్తున్న సాంకేతికాభివృద్ది , ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసిన గ్లోబలైజేషన్ కారణంగా ఏవిధంగా తమ ఉనికిని కోల్పోతున్నయ్యో... 'ఓనమాలు' చిత్రం ద్వారా హెచ్చరించే ప్రయత్నం చేసిన కధ రచయత తమ్ముడు సత్యం, కొత్త దర్శక నిర్మాత క్రాంతి మాధవ్ అభినందనియ్యులు.
తోలి సారి ఓ చలన చిత్రాన్ని రూపొందించిన క్రాంతి మాధవ్ దర్శకుడు, నిర్మాతకు మద్య ఉండవలసిన సమన్వయాన్ని చక్కగా పాటిస్తూ ... ఓనమాలు చిత్రాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దాడు. దర్శకుడిగా అయన చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు , వాటి కోసం వ్రాసిన మాటలు , ముఖ్యంగా పాటల చిత్రీకరణ అయన ప్రతిభకు నిదర్శనాలు. ' సూరీడు వచ్చిండు...' పాటలో సిరివెన్నెల గారి కలం చూసిన పల్లెటూరి అందాలను అంతే అందంగా తెర మీద ఆవిష్కరించాడు. మొత్తంగా దర్శకుడిగా పాసైన క్రాంతి మాధవ్ కధ విషయం లో, దానికి జోడించిన స్కీన్ ప్లే విషయంలో కొంత అస్పష్టతను కలగజేసాడు.
నారాయణ రావు మాస్టారి అందమైన జ్ఞాపకాలు, చెదు అనుభవాలు పల్లెటూరితో అనుబంధం ఉండి సిటీలో జీవిస్తున్న ప్రతి ఒక్కరిని టచ్ చేస్తాయి. మొత్తంగా ఈ సినిమా నిన్నటి అందమైన జ్ఞాపకాల దొంతరలా .... నేటి సమాజంలోని రుగ్మతల సమహరంలా కన్పిస్తుంది. ఈ సినిమాలో కదిలించే సన్నివేశాలున్నాయి, ఆలోచింపచేసే సంఘటనలున్నాయి. అంటే ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం , ఏ సంఘటనకు ఆ సంఘటన వేరు చేసి చూసుకుంటే బాగానే ఉంటాయి. కాని వాటిని పట్టి ఉంచే కధ గురించి ఆలోచిస్తే సినిమాలో ఉన్న అస్పష్టత అర్ధం అవుతుంది. దర్శకుడు అనుభవాలను పంచుకున్నట్టు ఉంటుదే కాని కధ చెబుతున్నట్టు ఉండదు. అందులోను కొంత సందేసాత్మకమైన పాయింట్ కాబట్టి చాలా చోట్ల బోర్ కొడుతుంది.
కధగా మాట్లాడుకుంటే దర్శకుడు ప్రేక్షకులకు వచ్చే చాలా అనుమానాలను తీర్చవలసి ఉంది. ఊరు... ఊరు... అంటూ తపించిన నారాయణ రావు మాస్టారు ఊరికి ఏమి చేశాడు అని ఆలోచిస్తే ఆరాటపడటం తప్ప అయన పెద్దగా చేసింది ఏమి కనిపించదు. అయన చదువు చెప్పిన పిల్లల్లో ఒక్కడు కూడా సరైన ప్రయోజకుడు అయినట్టు కనిపించడు . ఫైగా అయన నేర్పిన సంస్కారం మూలంగా నిబ్బరంగా ఇబ్బందులను , కష్టాలను ఎదుర్కుంటూ దీనుల్లగా బ్రతుకుతున్నాం అని గర్వంగా చెప్పుకుని తీరుగుతూ ఉంటారు. ఇదె ఉందంటే మాస్టారు దగ్గర చదువుకున్నవాళ్ళు నీతి మంతులు , అలాంటి నీతిమంతులకు ఈ దేశంలో మంచి జరగదు అన్న ఫీలింగ్ కల్పించాడు. అంటే కష్టపడి శ్రమ శక్తితో ఫై కి ఎదిగిన వాళ్ళు ఈ దేశంలో లేరనా అర్ధం. అలా కాదు అనుకుంటే ఏంతో మందికి చదువు చెప్పిన మాస్టారు దృడ సంకల్పం కలిగిన ఒక్క స్టూడెంట్ ని తాయారు చేయలేకపోయాడా..?
అలా చదువు చెప్పటం మినహా మాస్టారు ఊరికి చేసిందేమీ లేదు. అలానే ఊళ్లోవాళ్ళ సంగతి సరే అమెరికాలో ఉంటున్న సొంత కొడుక్కే సొంత ఊరి మీద మమకారం కలిగించలేక పోయాడు... అలాంటిది ఊళ్ళో ఉంటున్నోళ్ళు ... ఊరు వదిలి వెళ్ళినోళ్ళు ఊరి గురించి పట్టించుకోవటంలేదని భాదపడటం ఎంతవరకు సమంజసం అనిపించుకుంటుంది. అలానే క్లైమాక్స్ లో లాజిక్కు సంబంధం లేకుండా చాలా అంశాలను సొంత ఊరు అనే అంశానికి మెలేసాడు. అదెలా ఉందంటే దర్శకుడికి, రచయతకు ఓ రుగ్మత కనపడింది ... ఇక ఇప్పుడు జరుగుతున్నా ప్రతి తప్పును దానితో ముడిపెట్టేశారు. ఇలాంటి కొన్ని గమనించ గలిగే తప్పులు మూలంగా కొంత సినిమా చూస్తున్నప్పుడు అసంతృప్తి కలుగుతుంది. కాకపోతే సినిమాలో కొన్ని నిజాలు ఉన్నాయి వాటిని మనస్పూర్తిగా అభినందించాలి.
ఈ సినిమాకు ప్రధానమైన హైలైట్ మాటలు. అర్ధవంతమైన, ఆలోచింపచేసే మాటలను చాలా బాగా వ్రాశాడు ఖదీర్ బాబు. చివరిలో కంక్లుజన్ సరిగా లేక డైలాగులు పండలేదు...! అది మినహా చాలా చోట్ల సినిమాను కాపాడింది ఖదీర్ మాటలే...! కోటి సంగీతం వినసొంపుగా ఉంది. కాని ఆ పాటలకు విలువను తీసుకువచ్చింది మాత్రం సీతారామ శాస్త్రి పదాలే ..! ప్రత్యేకంగా 'సూరీడు వచ్చిండు...' 'పండగంటే ' పాటలను అయన చాలా అద్భుతంగా వ్రాశారు . హరి అనుమోలు కెమేర పనితనం గౌతమ్ రాజు ఎడిటింగ్ సినిమా కధకు తగ్గట్టు బాగున్నాయి.
మరోమారు నటకీరిటి వైవిధ్యమైన పాత్రలో కనిపించి శక్తి మేర నటించి మెప్పించాడు. అయన భార్యగా కళ్యాణి ఆకట్టుకుంది. చలపతి రావు, గిరిబాబు, రఘుబాబు, కొండవలస తదితరులు వారి పాత్రలకనుగుణంగా బాగానే చేశారు.
ప్లస్ పాయింట్స్:
ఖదీర్ బాబు మాటలు,'సూరీడు వచ్చిండు...' 'పండగంటే ' పాటలు , రాజేంద్ర ప్రసాద్ నటన ప్రధానంగా ప్లస్ పాయింట్స్ .
మైనస్ పాయింట్స్:
స్పష్టత లేని కధ , కధనాలు .... వాటి మూలంగా కొన్ని సన్నివేశాలు పండక కలిగే బోర్..! చాల వరకు ఈ సినిమాకు మైనస్ పాయింట్స్.
కోసమెరుపు :
ఎవరి సొంతూరుకు వాళ్ళు వెళ్లి అత్మీయులందరితో కలిసి ఈ సినిమాను చూస్తే చాలా వరకు బాగుంటుది. ఎందుకంటే మన ఊరితో మనకున్న ఆనందాన్ని నెమరేసుకోవచ్చు. అలా కాకుండా సినిమాగా చూడాలనుకుంటే మాత్రం నిరాశ పడే అవకాశం ఉంది జాగ్రత్త..!
Maruthi Talkies Rating : 2.5 Out Of 5























