పట్టు వదలని విక్రమార్కుడికి కజిన్ బ్రదర్ అని అనిపించుకోవాలని పట్టు వదలకుండా ప్రయోగాలు చేస్తున్న రా 'కింగ్ ' స్టార్ మంచు మనోజ్ తాజాగా సినిమా చూపిస్తాను 'ఊ కొడతారా ... ఉలిక్కి పడతారా ' అంటూ దియేటర్ లకు వచ్చాడు. పద్మశ్రీ మోహన బాబు సమర్పణలో మంచు ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై మంచు లక్ష్మి ప్రసన్న నిర్మించిన ఈ చిత్రం తో శేఖర్ రాజా దర్శకుడిగా పరిచయం అయ్యాడు. నటసింహ బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో మనోజ్ తో దీక్ష సేథ్ జోడి కట్టగా ప్రభు , సుహాసిని, సాయికుమార్, లక్ష్మి ప్రసన్న తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో కనిపించారు. బాబో శశి సంగీతాన్ని అందించాడు.
వరస పరాజయాలతో సతమతమవుతున్న మంచు ఫ్యామిలి పూర్వవైభవాన్ని సాధించటానికి ఎంతో కష్టపడి రూపొందించిన ఈ చిత్రం కొద్దిగా కొత్తగా కనిపించి ప్రేక్షకులలో ఆసక్తి కలిగించింది. అందుకు ప్రధాన కారణం బాలయ్య చాలా కాలం తరవాత అతిధి పాత్రలో కనిపించటం అయితే ... ఇతర కారణాలు వెరైటి గా అనిపిస్తున్న కధాంశం... విభిన్నంగా కనిపిస్తున్న మనోజ్ పాత్ర. ఇవన్నీ కలిసి సినిమా మీద ఓ మోస్తరు అంచనాను తెగలిగాయి. కాని తింటే గాని రుచి చెప్పలేం అన్నట్టు చుస్తే గాని మనోజ్ సినిమాల గురించి చెప్పలేం అని పబ్లిక్ టాక్.. ! ఎందుకంటే మనోజ్ గత సినిమాల ట్రైలర్స్ అన్ని సూపర్ హిట్టే, కాకపోతే పూర్తీ సినిమాలే అంచనాలను తారుమారు చేసాయి . మరి ఈ సినిమా అన్నా ప్రేక్షకులను ఉత్సాహ పరిచిందో...లేక ఊసురనిపించిందో..మన సమీక్షలో చూద్దాం.
కధ ;
తరతరాల పటిష్టమైన చరిత్ర కలిగిన రుద్రమనేని వంశస్తులకు వారు నివసించే గందర్వ మహల్ అంటే ప్రత్యేకమైన అభిమానం, గౌరవం. అలాంటి గొప్పతనాన్ని సంతరించుకున్న ఆ మహల్ లో రుద్రమనేని వంశస్తుడైన నరసింహ రాయడు (బాలకృష్ణ) హయం లో తలెత్తిన వీపరితలు, వాటి పరిణామాలు ఆ భవంతిని భూతాల గృహంగా ప్రచారంలోకి తెస్తాయి. దాంతో నరసింహ రాయుడి తరవాతి తరం అనేక ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఆ కష్టాల నుండి వారిని బయట పడేయటానికి నరసింహ రాయుడి వద్ద గుమస్తాగా పనిచేసిన శేషయ్య మనవడు మనోజ్ పూనుకుంటాడు. ఆలా గందర్వ మహల్ కు వచ్చిన మనోజ్ అక్కడి పరిస్థితులను అవగతం చేసుకుని వాటిని నరసింహ రాయుడి ఆత్మ సాయంతో ఎలా పరిష్కరించ గలిగాడు అన్నది కధ .
విశ్లేషణ :
అయ్యింది..... అనుకున్నంత అయ్యింది. అందరు అనుమానించి నట్టే మనోజ్ మరోసారి ప్రయోగం అంటూ ఊరించి... ఊరించి... ఊసురమనిపించాడు. ఈ సినిమాను డ్రీం ప్రాజెక్ట్ గా చెప్పుకున్న మనోజ్ అభిరుచి ఇంత నాసిరకంగా ఉంటుందా.. అని వాపోవాల్సివస్తుంది సినిమా చూసిన తరవాత....! అలాగే ఇదేదో డార్క్ కామెడీ అనే కొత్త తరహ సినిమా అని,ఇలాంటిది మన తెలుగులో మొదటిది అని గొప్పగా చెప్పు కొచ్చారు కదా అని సినిమాను పరిశీలనగా చూస్తే ... ఆ కొత్తదనం , ఫ్రెష్ నెస్ అనే మాటలను అంతు చిక్కని 'డార్క్ ' లో వెతుకుతున్నమేమో ... !అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి రొటీన్ ఫక్తు బోరింగ్ కధ కోసం కొత్త దర్శకుడు శేఖర్ రాజా 4 సంవత్సరాలు కష్టపడ్డాడంటే అతన్ని ఏ విధంగా ప్రశంసించాలో అర్ధంకాని పరిస్థితి. అలానే ఈ సినిమా కోసం నోరు కొట్టుకుని... కండలు కరిగించి... కుటుంబానికి , సమాజానికి దూరంగా ఉంటూ ... ఈ సినిమాయే లోకంగా రెండు సంవత్సరాలు శ్రమటోడ్చిన మనోజ్ ను తలచుకుంటుంటే గుండె తరుక్కు పోతుంది.... జాలేస్తుంది. కాని ఇందులో వాళ్ళను తప్పుపట్టటానికి లేదు..! వాళ్ళకేం తెలుసో... వాళ్ళకేం వచ్చో... అదే చేసి చూపించారు. మనోజ్ సినిమాలంటే ఇలాగే ఉంటాయని తెలిసి కూడా ఈసారన్న కొత్తగా ఎమన్నా చూపిస్తాడేమో అని ఆశతో కూడిన అపోహపడి సినిమా చూడటానికి వచ్చిన వాళ్ళదే తప్పు అవుతుంది తప్ప వారిది మాత్రం కాదు.
ఈ మద్య ఆధునిక సాంకేతికతను ఉపయోగించి సినిమాలను వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు.... అంత మాత్రానికే సినిమా గొప్పగా ఉంటుంది అని ఊహించుకోకూడదు. అసలు సంగతి సినిమా చూసేప్పుడు కదా తెలిసేది. ఈ ఊ...కో...ఊ...ప... ట్రైలర్ లో మనోజ్ వింత , వింత గెటప్పులు భయంకరమైన రూపు చూసి ఏదో ఊహించుకుని దియేటర్ కు వచ్చిన ప్రేక్షకులు మనోజ్ వేసిన వేషాలు ఒక పాటకు మాత్రమే పరిమితం అని ... కధతో ఆ గెటప్పులకు సంబంధంలేదని తెలుసుకుని వీపరితంగా డీలా పడిపోతారు. అందున ఆ పాట మొదటి పాట కావడంతో పాట పూర్తవగానే సినిమా మీద తెలియని అసహనం మొదలవుతుంది. కాని బాలయ్య వస్తాడు అనే ఆశ కూసంత ఉత్సాహాన్ని నిలిపి ఉంచుతుంది. అలానే బాలయ్య వచ్చాక ఆ ఉత్సాహానికి కొంత ఊపు కూడా వస్తుంది. కాని ప్రేక్షకుల మీద దయలేని దర్శకుడు డల్ ఇంటర్వల్ తో ఆ ఉత్సాహాన్ని నీరుగార్చాడు. అది మొదలు చివరి వరకు
వీలైనంత విసిగిస్తూ... అవసరం మేరా అసహనాన్ని కలిగిస్తూ .. చేతనైనంత చికాకు తెప్పిస్తూ క్లైమాక్స్ లో కొంచెం ఊపిరిలూది రొటీన్ గా సినిమాను ముగించారు.
సినిమాలో అజయ్ పోషించిన మాంత్రికుడి పాత్ర గందర్వ మహల్ లో ఓ మంచి ఆత్మ, ఓ చెడు ఆత్మ ఉండటాన్ని గమనించి ఓ డైలాగ్ చెబుతుంది. 'ఈ మహల్ లో మంచి ఉంది... చెడు ఉంది... ఆ రెండు ఒకదానితో ఒకటి ఘర్షణ పడుతున్నాయి' అని. ఆ మాటలను అర్ధం చేసుకుని సినిమాకు స్క్రిప్ట్ వర్క్ చేసినట్టైతే తప్పక కొత్తదనం కనిపించేది. అలా కాకుండా ఆ అర్ధాన్ని కేవలం డైలాగ్ వరుకే పరిమితం చేసి దర్శకుడు తన అసమర్ధతను చాటుకున్నాడు.అలానే బాలయ్య పాత్ర చాల బలమైనది.అలాంటి పాత్ర ఓ పెద్ద సమస్యను ఎదుర్కుంటూ ప్రాణాలర్పించి ... తిరిగి ఆ సమస్య తలెత్తకుండా ఆత్మ రూపం లో వచ్చుంటే బాగుండేది. అలా కాకుండా ఓ సెంటిమెంట్ కోసం ఆత్మలా కనిపించటం ఆసక్తిని కలిగించలేక పోయింది. అంతే కాకుండా బాలయ్య టాలెంట్ ను సరిగా వినియోగించుకులేదు. పెద్దగా విశేషాలు లేని ఈ కధలో... కనిపించే తప్పులు లెక్కలేనన్ని... ఈ మాత్రం దానికి రెండు సంవత్సరాలు వెచ్చించాలా ....అన్నది ఎవరు తీర్చలేని సందేహం.
లక్ష్మి భూపాల్ మాటలు పర్వాలేదు కాని చాల చోట్ల శృతి మించాయి. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకున్న పెద్ద అసెట్. మొత్తం సినిమాను ఏంతో అందంగా చిత్రీకరించాడు. నిర్మాణాత్మక విలువలు ఉన్నతంగా ఉన్నాయి. గందర్వ మహల్ సెట్ ను అద్భుతంగా తీర్చిదిద్దారు. సాంకేతికంగా అన్ని విభాగాలు మంచి స్టాండర్డ్స్ తో పనిచేశాయి.
అభినయం :
మనోజ్ నటన పరంగా కొంచెం కూడా వైవిధ్యాన్ని ప్రదర్శించక పోగా చాలా నిరుత్సాహ పరిచాడు. విబిన్న గెటప్పుల్లో కాని నటనలో మాత్రం రాణించలేదు. అతను చేసిన డాన్సులయితే అసలు నప్పలేదు. నటన తో పాటు యాక్షన్ సన్నివేశాలకు దర్శకత్వం వహించిన మనోజ్ ఆ సన్నివేశాలను చాలా చప్పగా చిత్రీకరించాడు. బాలయ్య మాత్రం సూపర్ ..! బాలయ్య పాత్ర పరిది మేరా అద్భుతమైన ఆహార్యంతో, పవర్ ఫుల్ డైలాగులతో అలరించాడు. తానూ కనిపించిన అన్ని సన్నివేశాలలోను పూర్తీ ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. సూను సూద్ బాడ్ బాయ్ గా మరో సారి ఆకట్టుకున్నాడు. లక్ష్మి ప్రసన్న నటనలో వైవిధ్యాన్ని ప్రదర్శించటానికి ప్రయత్నించింది.. కొంత వరకు పర్వాలేదు. కానీ సంభాషణ ఉచ్చారణ మాత్రం కొంత అసహనాన్ని కలిగిస్తుంది. దీక్ష సేథ్ ఎప్పటిలానే తన భయంకరమైన నటనతో జనాలను బెదరగోట్టింది. ఆమె నటన చూసి గాడ్ ...ఈమెకు నటనైనా నేర్పించండి లేదా... సినిమాలన్న మాన్పించండి...అని గట్టిగా అరవాలనిపిస్తుంది. ప్రభు బాగా నటించాడు. సాయి కుమార్, సుహాసిని సహా మిగత నటులు వారి పాత్రాలకనుగుణంగా బాగా నటించారు.
ప్లస్ పాయింట్స్:
గందర్వ మహల్ సెట్, సినిమాటోగ్రఫీ సహా అన్ని సాంకేతిక విభాగాల పనితనం , బాలయ్య నటన ప్రధానంగా ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్.
మైనస్ పాయింట్స్ :
నిరుత్సాహ పరిచిన మనోజ్, రొటీన్ కధ , బోరింగ్ కధనం , విశేషం లేని క్లైమాక్స్ ప్రధానంగా మైనస్ పాయింట్స్.
కొసమెరుపు;
సినిమా ప్రచార చిత్రాలను చూపించి .. ఊ ..కొట్టించిన మనోజ్ పూర్తీ సినిమా చూపించి జనాలను ఊసురనిపించాడు. ఆరుంధతి, చంద్రముఖి వంటి సినిమాలతో పోల్చారు కాని ఈ సినిమా వాటి నీడను కూడా తాక లేకపోయింది అని నిర్మొహమాటంగా చెప్పొచ్చు. దీనిని బట్టి సినిమా పరిస్థితి ఏమిటో ఎవరికీ వాళ్ళు అర్ధం చేసుకోవచ్చు.

No comments:
Post a Comment