గత సంవత్సరం బద్రీనాథ్ సినిమాలో క్షేత్ర పాలకుడిగా అభిమానుల మన్ననలు అందుకోలేక పోయిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సంవత్సరం త్రివిక్రమ్ ను తోడూ తీసుకుని కొంటె అల్లరి చేయటానికి 'జులాయి' గా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డి వి వి దానయ్య సమర్పణలో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై నిర్మితమైన ఈ చిత్రంలో బన్నీ సరసన ఇలియానా హొయలు ఒలకబోసింది. రాజేంద్రప్రసాద్, సోను సూద్, బ్రమ్మి , యం యస్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలలో కనిపించారు. దేవి సంగీతాన్నిఅందించాడు. స్టార్ సినిమాటోగ్రాఫర్ లు నాయుడు సోదరులు కేమెర బాధ్యతలు నిర్వహించారు.
కొత్త సినిమా మార్కెటింగ్ విధానం టాలీవుడ్ నటులలోను , దర్శకులలోను ఒక స్పష్టమైన మార్పును తీసుకు వచ్చింది. దానిని జాగ్రత్తగా ఫాలో అవుతూ లాభాలను పిండుకుంటున్నారు సినిమావాళ్ళు. ఆ క్రమంలో ఇప్పుడు బన్ని , త్రివిక్రమ్ వంతు వచ్చింది . ఏంతో ఇష్టపడి... మరెంతో కష్టపడి బన్నీచేసిన బద్రీనాథ్, త్రివిక్రమ్ చేసిన ఖలేజా వారికి తీరని నిరాశను మిగిల్చాయి. ఆ అనుభవాలు నేర్పిన పాఠాలను ఆచరణ లో పెడుతూ వారిద్దరూ రూపొందించిన ఈ 'జులాయి' మరింత మందికి ఆదర్శం కానుంది.
దేవి శ్రీ పాటలు, త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగులు విడుదలకు ముందే సినిమాకు కావలసినంత ప్రచారాన్ని తీసుకువచ్చాయి. సినిమా హిట్టా...! ఫట్టా..! అన్న సంగతి పక్కనుంచి త్రివిక్రమ్ నుండి ఓ సోలిడ్ ఎంటర్టైనర్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారని ఈ సినిమా మీదా పెరిగిన క్రేజ్ తెలియజేస్తుంది. అలా ఎంతో ఆశగా ఉన్న ప్రేక్షకుల ఇష్టాన్ని త్రివిక్రమ్, బన్ని కలిసి ఎంత వరకు నేరవేర్చారో .. మన సమీక్షలో చూద్దాం.
కధ:
రవీంద్ర నారాయణ (అల్లు అర్జున్) , బిట్టు(సోను సూద్ ) ఒకే రకంగా ఆలోచించే తెలివైన వాళ్ళు. కాకపోతే రవి ఆలోచనలు పెద్దవే కాని ఆశ చిన్నది. బిట్టు ఆలోచనలు పెద్దవే...... ఆశ కూడా పెద్దదే. అందుకే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా చలామణి అవుతూ వరద రాజులూ(కోట శ్రీనివాస రావు ) అనే రాజకీయ నాయకుడి సహాయంతో 1500 కోట్ల బ్యాంకు డబ్బు కొట్టేయటానికి ప్లాన్ చేస్తాడు.
తక్కువ శ్రమ తో దొంగ దారిలో అయినా ఒకే దెబ్బతో జీవితంలో సెటిల్ అవ్వాలనుకునే మధ్యతరగతి రవి కి బిట్టుకు సంబందమే ఉండదు. కాని అనుకోని పరిస్థితిలో బిట్టుకు దొంగతనం చేసే ముందు రవి తో చిన్న పరిచయం అవుతుంది. దాంతో 1500 కోట్ల బ్యాంకు దోపిడీ కేసులో బిట్టు నేరస్తుడైతే ... రవి సాక్షిగా పోలీసులకు సహాయం చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలో బిట్టు తమ్ముడు రవి మూలంగా చనిపోతాడు అలానే దొంగలించిన డబ్బు కూడా దక్కకుండా పోతుంది. దాంతో బిట్టు రవి మీద పగ పెంచుకుంటాడు.
పరిస్థితిని గమనించిన పోలీసులు బిట్టు నుండి రవినీ కాపాడటానికి హైదరాబాద్ పంపిస్తారు. అక్కడ ఏ సి పి (రాజేంద్ర ప్రసాద్ ) ఇంట్లో ఉంటున్న రవి మధు(ఇలియానా ) ను చూసి ప్రేమిస్తాడు. బిట్టు పోగొట్టుకున్న డబ్బును రికవరీ చేసుకునే ప్రయత్నాలు చేస్తూనే రవినీ కుటుంబంతో సహా చంపటానికి కుట్ర చేస్తూ ఉంటాడు. ఆ ఫై బిట్టు కుట్రలను ఎదుర్కుంటూ 1500 కోట్లను రవి ఎలా వెనక్కి తే గలిగాడు అన్నది మిగిలిన కధ.
విశ్లేషణ :
'కష్ట పడకుండా వచ్చిన సొమ్ము ఊరకనే రాదు.... లెక్క లేనన్ని కష్టాలతో వస్తుంది' అని జులాయి సినిమా తో చెప్పాలన్నది త్రివిక్రమ్ ఉద్దేశం. ఆలోచన అయితే బాగానే ఉంది కాని ఆ పాయింట్ ను చెప్పిన విధానమే చాలా అపోహలకు అవకాశం ఇస్తుంది. ఇది ఈ సినిమా వరుకే కాదు రెగ్యులర్ గా త్రివిక్రమ్ సినిమాలలో ఎప్పుడు కనిపించేదే. అయన సినిమా కధలో ప్రధానమైన అంశం సినిమా మొదట్లో , ఇంటర్వెల్లో అలాగే చివరలో మాత్రమే ఆక్టివ్ గా ఉంటుంది. మిగత సమయం అంత మంచి రూం తీసుకుని రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. ఆ మిగిలిన పార్ట్ను త్రివిక్రమ్ తనదైన శైలిలో వినోదానికి కేటాయించి నవ్వులు పూయించే ప్రయత్నం చేస్తాడు.
అయన దర్శకతం వహిస్తున్న మొదట్లో ఇది పొరపాటు కింద అనుకున్నారు కొందరు కాని ఇప్పటి వరకు త్రివిక్రమ్ అన్ని సినిమాలలో అదే ఫాలో అవుతూ వచ్చారు, చివరికి ఈ సినిమాలో కూడా...! దీనితో తెలిందేమా అంటే..... ఇది పొరపాటు కాదు త్రివిక్రమ్ స్టైల్ అఫ్ ఫిలిం మేకింగ్ ఫార్మేట్ అని. ఈ టైపు అఫ్ ఫార్మేట్ లో ఉండే మజా ఏమిటంటే... సినిమాలో వచ్చే సన్నివేశాలను విడి విడిగా చూస్తే ... చాలా అద్భుతంగా ఉంటాయి,వాటిని మనస్పూర్తిగా అస్వాదిస్తాం కూడా..!
అలానే ఇందులో ఓ ప్రమాదం కూడా ఉంది అది కూడా ఇంటర్వెల్ తరవాత.... ఎందుకంటే అప్పటి వరుకు త్రివిక్రమ్ మ్యాజిక్ మనల్ని కట్టి పడేస్తుంది. ఆ తరవత కూడా ఆ మ్యాజిక్ కంటిన్యూ అవుతుంది.. ఎప్పటివరుకు అంటే అసలు సినిమా కదేంటి అని చూసేవాళ్ళ బుర్రలో ఆలోచన రానంత వరుకు... ! ఒక్కసారి ఆ ఆలోచన వచ్చిందా.... వెంటనే లాజిక్కులు గుర్తుకు వస్తాయి. ఆ ఫై సినిమా మీదా ఆశక్తి నెమ్మదిగా తగ్గుతూ పోతుంది. కాని ఇక్కడో వెసులుబాటు.. ఈ విషయాన్నీ గుర్తించ గలిగిన వాళ్ళకి మాత్రమే కొద్దిగా అసంతృప్తి.... గుర్తించలేదు అనుకోండి సినిమాను భీభత్సంగా ఎంజాయ్ చేస్తారు.
దానికి ఒక ఉదాహరణ చెబుతా సినిమాకు జులాయి అని పేరు పెట్టారు... కాని హీరో అసలు ఒక్క జులాయి వేషం కూడా వేయాడు... ఫై పెచ్చు బాధ్యత గల పౌరిడిలా పోలీసులకు సహకరిస్తూ... వారికి నీతులు చెబుతూ క్రిమినల్స్ ను పట్టుకోవటం లో వారికంటే ఎక్కువ ఉత్సాహంగా ఉంటాడు. ఇలాంటివి ఆలోచిస్తే సినిమాలో చాలానే ఉంటాయి కాని పట్టించుకోక పోవటమే ఉత్తమం. అప్పుడే త్రివిక్రమ్ పెట్టే గిలిగింతలను ఎంజాయ్ చేయవచ్చు.
జులాయి విషయానికి వస్తే కధ చాలా సింపుల్..కాని స్క్రీన్ ప్లే చాలా కాంప్లికేటేడ్. సినిమా ఆసక్తి కరమైన బ్యాంకు రోబరి ఎపిసోడ్ తో మొదలవుతుంది. ఇది డార్క్ నైట్ సినిమాలో జోకర్ ఇంట్రడక్షన్ సీన్ ను తలపిస్తుంది. అలా మొదటి 20 నిముషాలు సీరియస్ గా సాగిన సినిమా కీలకమైన మలుపు తీసుకుని కామెడీ రోడ్ ఎక్కుతుంది. బ్రమ్మి, యం యస్ , రాజేంద్ర ప్రసాద్ లు చేసే కామెడీ కి బన్నీ, ఇలియానాలా రొమాన్స్ కూడా తోడై సరదాగా గడిచి పోతుంది.
అలా రేసిగా సాగిపోతున్న సినిమా మూడో పాట పూర్తవగానే నెమ్మదిగా డ్రాప్ అవటం మొదలుపెట్టింది. అది అలా చివరి వరకు కొనసాగింది. కాకపోతే మద్యలో బ్రమ్మి అండ్ కో చేసిన కామెడీ చాలా వరకు రిలీఫ్ నిస్తుంది. జులాయి ఫస్ట్ హాఫ్ సూపర్ గాను సెకండ్ హాఫ్ కొంత డల్ గాను మొత్తంగా ఓకే పర్వాలేదు అని మాత్రమే అనిపిస్తుంది.
సాంకేతికంగా త్రివిక్రమ్ ప్రతిభను ఎంత పొగిడిన తక్కువే. తెలుగు సిని ప్రపంచం గర్వించ తగ్గ నిపుణుడు. దర్శకుడిగా అన్ని విభాగాలను చాలా గొప్పగా ఉపయోగించుకుంటాడు. ఆ పనితనం సినిమా ప్రతి ఫేం లోను కనపడుతుంది. ఇక మాటల రచయతగా త్రివిక్రమ్ గురింఛి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమి లేదు...! సందర్భానికి అవసరమైనట్టు, అయన అభిమానులు ఆనందపడేట్లు సింగిల్ లైన్ పంచ్ డైలాగులను ఈ సినిమా కూడా కావలసినన్ని పొందుపరిచారు. దర్శకుడిగా,
మాటల రచయతగా సినిమా మీద పూర్తీ ఆధిపత్యం ప్రదర్శించే త్రివిక్రమ్ కధ రచయతగా కొంత అస్పష్టతను మైంటైన్ చేస్తున్నాడు. దానిని గుర్తించి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.
త్రివిక్రమ్ మాటలతో పాటు దేవి శ్రీ అందించి పాటలు , వాటిని తీసిన విధం, వాటికీ బన్నీ వేసిన స్టెప్పులు... అబ్బో... వీటి గురించి చెప్పటం కాదు చూస్తేనే బాగుంటుంది. నాయుడు సోదరుల సినిమాటోగ్రఫీ , ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ప్లెజెంట్ గా ఉన్నాయి. నిర్మాణాత్మక విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
అభినయం :
బన్నీ ఈ సినిమాలో చాలా ఫ్రెష్ గా కనిపించాడు... అంతకంటే బాగా ఎంటర్టైన్ చేశాడు. ఇప్పటి వరకు డైలాగ్ డెలివరీ, ఎక్స్ ప్రేషన్స్ విషయంలో కొద్దిగా నిరాశ పరిచే బన్ని ఈ సినిమాతో పరిపూర్ణమైన నటుడిగా అవతరించాడు. అతని డైలాగ్స్ లో స్పష్టత ఉంది, ఎక్స్ ప్రేషన్స్ లో అందం ఉంది, ఆహార్యం మీదా అదుపు ఉంది...ఇక డాన్సుల గురించి చెప్పేదేముంది.....! బన్ని పుట్టిందే డాన్సుల కోసం . పాట పాటకు కొత్త కొత్త స్టెప్పులేసి అభిమానులను అలరించాడు.
ఇలియానా ఎప్పటిలానే అందాన్ని వెదజల్లి ప్రేక్షకులను సమ్మోహనపరిచింది. బన్ని ఇలియానాల జోడి సూపర్ గా సెట్ అయ్యింది. వారిద్దరి మద్య కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యింది. సోను సూద్ పాత్ర పవర్ ఫుల్ గా లేక పోవటం కొంతవరకు లోటు... కాని తన పాత్ర పరిది మేర సోను బాగా నటించాడు. త్రివిక్రమ్ రాసిన మాటలు కోట శ్రీనివాస రావు నోటి వెంటే వింటేనే వినసొంపుగా ఉంటాయి అని అనిపిస్తుంది. అంత కమాండ్ తో కోట ఆ డైలాగులు చెబుతారు. ఈ సినిమాలో కూడా కోట గుర్తుంచుకునే కొన్ని డైలాగులను బాగానే పేల్చారు.
రాజేంద్ర ప్రసాద్కు ఫుల్ లెంగ్త్ పాత్ర పడింది కాని అది ఆయనే ప్రత్యేకంగా చేయవలసిన పాత్ర అయితే కాదు. ఏదేమైనా తన పాత్రకు 100 % న్యాయం చేసారు. ఇక బ్రమ్మి మరో సారి ఇన్నోసెంట్ దొంగగా కనిపించినప్పటికీ ఫ్రెష్ అప్రోచ్ తో సినిమాలో నవ్వుల పండుగా చేశాడు. సినిమాలో బ్రమ్మి కనిపించినంత సేపు నవ్వుతూనే ఉంటాం. యం యస్ ఓకే అనిపిస్తాడు. ధర్మవరం, రావు రమేష్ సహా మిగత నటులు వారి పాత్రలకనుగుణంగా బాగా నటించారు.
ప్లస్ పాయింట్స్ :
త్రివిక్రమ్ మాటలు , దర్శకత్వం , బన్ని డాన్సులు, బ్రమ్మి అండ్ కో కామెడీ ప్రధానంగా ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్.
మైనస్ పాయింట్స్;
సింపుల్ కధ , లాజిక్ తప్పిన కధనం , కొద్దిగా బోర్ అనిపించే సెకండ్ హాఫ్ కొంత వరకు ఈ సినిమాకు మైనస్ పాయింట్స్.
కొసమెరుపు :
ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. 'ఈ దేశంలో జనాలు లాజిక్ కంటే మ్యాజిక్ నే ఎక్కువ నమ్ముతారు... అందుకే సైంటిస్టులా కంటే బాబాలు ఫేమస్ ' అని. అది సినిమాలకు కూడా వర్తిస్తుంది. త్రివిక్రమ్ తన సినిమాల్లో లాజిక్, మ్యాజిక్ రెంటికి సమానమైన స్థానం కల్పిస్తాడు. దాని మూలంగా సినిమాలో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. అలా కాకుండా లాజిక్ నో ... మ్యాజిక్ నో... ఏదో ఒక దానిని నమ్ముకుంటే ఆయన సినిమాలకి ఒక పరిపూర్ణత వస్తుందేమో...అని ఒక సూచన.
Maruthi Talkies Rating 3 out of 5

No comments:
Post a Comment