మూడు నెలలు తిరక్కుండానే మూడో సినిమాతో నందమూరి అభిమానులను అలరించటానికి సిద్దం అయిన నటసింహ బాలకృష్ణ శ్రీమన్నారాయణ చిత్రంతో ఈ వారం దియేటర్లలో సందడి చేయటానికి వచ్చాడు. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో రమేష్ పుప్పాల నిర్మించిన ఈ చిత్రానికి రవి చావలి దర్శకుడు. ఈ సినిమాలో తొలిసారి బాలయ్య జర్నలిస్ట్ పాత్రలో నటించగా అయన సరసన పార్వతి మిల్టన్ , ఇషా చావ్లా హీరోయిన్ లుగా నటించారు. చక్రి సంగీతాన్ని అందించాడు.
జయాపజయాలను సమదృష్టితో స్వీకరిస్తూ తెలుగు చలన చిత్ర యవనిక ఫై అవిశ్రాంతంగా తన నటకౌశాలన్ని ప్రదర్శిశిస్తూ అభిమానులను అలరిస్తున్న నందమూరి నట సింహం ఈ యేడాది మూడు చిత్రాల విడుదలలో భాగస్వామిగా ఉండి .... తోటి అగ్ర నటులకు సవాలు విసిరాడు. ముందు విడుదలైన రెండు చిత్రాల (అధినాయకుడు, ఉ కొడతార ఉలిక్కి పడతారా ) ఫలితాలు నిరాశపరిచిన మనసులో పెట్టుకోకుండా నూతనోత్సాహంతో శ్రీమన్నారాయణను పూర్తీ చేసిన బాలయ్య ఈ సినిమాలో కొత్త బాలకృష్ణను చూస్తారు అని ప్రకటన చేసాడు. 96 చిత్రాలుగా చూడని బాలకృష్ణను తన 97 వ చిత్రంలో ఎంత కొత్తగా చూపించాడో...మన సమీక్షలో చూద్దాం .
కధ :
పెద్ద సంఘసంస్కర్త అల్లూరి కల్కి నారాయణ (విజయకుమార్) కొడుకు శ్రీమన్నారాయణ అలియాస్ శ్రీమాన్ (బాలకృష్ణ ) జర్నలిస్ట్ గా పనిచేస్తూ ఉంటాడు. తన వృత్తిలో భాగంగా జై జవాన్ స్కాం ను బయట పెట్టి మంత్రి బైల్ రెడ్డి ( జయ ప్రకాష్ రెడ్డి ) అతని అనుచరుల ఆటకట్టిస్తాడు శ్రీమాన్. శ్రీమాన్ కు అతని మరదలు భానుమతి(ఇషా చావ్లా )తో నిశ్చితార్ధం జరుగుతుంది. అలానే మరో చానెల్ రిపోర్టర్ స్వప్నిక (పార్వతి మిల్టన్) కూడా శ్రీ మాన్ ను ఇష్టపడుతూ ఉంటుంది. రైతుల గురించి తపించిపోయే కల్కి నారాయణ పేద రైతుల సహాయార్ధం జై కిసాన్ అనే కార్యక్రమాన్ని మొదలుపెడతాడు. అందులో భాగంగా రైతుల సహాయ నిధి ఏర్పాటు చేసి 5000 కోట్ల రూపాయలు విరాళాల ద్వార సేకరిస్తాడు.
తరవాత జై కిసాన్ కార్యక్రమం ప్రారంభించాలనుకునే సమయానికి కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని కల్కి నారాయణ మరణిస్తాడు. అంతే కాకుండా 5000 కోట్ల రూపాయల సొమ్ము దొంగలించబడుతుంది. ఆ నేరం శ్రీమన్నారాయణ మీద పడుతుంది. హడావిడి సద్దుమణిగి కూల్ గా ఆలోచించిన శ్రీమాన్ తను ప్లాన్ ప్రకారం ఇరికించబడ్డనని తెలుసుకుని ప్రతీకారానికి పూనుకుంటాడు. ఆ ఫై దొంగలను కనిపెట్టి, 5000 కోట్లను వెనక్కు తెచ్చి తండ్రి ఆశయాన్ని ఎలా నెరవేర్చాడు అన్నది మిగిలిన కధ .
విశ్లేషణ:
శ్రీమన్నారాయణ కధ గా చూస్తే పరమ రొటీన్ కధ . కధనం గురించి చెప్పాలంటే మూస శైలిలో రూపొందించిన ఓ రోడ్ద కొట్టుడు తెలుగు కమర్షియల్ సినిమా . ఈ తరహ చిత్రాలు తెలుగు సినిమాకు హీరోయిజం పరిచయం అయినప్పటి నుండి వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాను 1960 లోనో 70 లోనో తీసినట్టైతే తప్పకుండా సంవత్సరం ఆడేది. అంత విషయం ఉంది ఈ సినిమాలో...! విధి విచిత్రమైనది కాకపోతే అప్పుడు పుట్టాల్సిన టాలెంట్ ను ఇప్పటి వరకు ఆపి దేవుడు ఎంత తప్పు చేసాడు అని అనిపిస్తుంది .
దర్శకుడు రవి చావలి లో ఒక సినిమా దర్శకుడి కంటే స్టేజ్ మీద డ్రామా వేయించే దర్శకుడు ఎక్కువ కనపడుతూ ఉంటాడు. అరె.... చాలినంత బడ్జెట్ ఉండి... ఒక పెద్ద హీరోతో సినిమా చేస్తూ కూడా ఏదో స్టేజ్ మీద నాటకం వేయిస్తున్నట్టు సన్నివేశాలు రూపకల్పన చేసుకుని చాలా భద్రంగా లేని పోనీ లిమిటేషన్స్ మద్య చిత్రీకరణ చేయటం చూస్తుంటే అదే అనిపిస్తుంది. సామజిక స్పృహ కలిగిన వ్యక్తిగా కొన్ని మంచి విషయాలను తన సినిమాలతో చెప్పాలనుకునే విషయంగా రవి అభినందనియ్యుడు. ఈ సినిమాలో కూడా రైతు సహాయనిధి అనే ఒక ఆలోచించవలసిన పాయింట్ ను వెలుగులోకి తెచ్చాడు. బాబాలకు, మఠాలకు , స్వాములకు లక్షలకు లక్షలు విరాళాలు అందుతున్నాయి. అలాంటిది రైతు మనుగడ కోసం, వ్యవసాయం అభివృద్ధి కోసం సమాజం తానూ నిర్వర్తించవలసిన బాద్యతను గుర్తుచేసాడు హాట్స్ ఆఫ్. ఇది చిన్న పాయింట్... మహా అయితే ఒక నిమిషంలో కన్వే చేసేయ వచ్చు. సినిమా అంటే 2 గంటల ఉంటుంది. ఆ సమయాన్ని రసవత్తరంగా మలిచి ప్రేక్షకులను కట్టి పడేయటంలో రవి చావలి ఎప్పటిలానే నిరాశపరిచాడు.
అవసరం మేర లాజిక్ లను ఎగ్గోడుతూ.... కొన్ని చోట్ల అవసరం లేక పోయిన లాజిక్ లను తగిలిస్తూ రవి నడిపిన కధనంతో, సందర్భంతో సంబందం లేకుండా వచ్చే పాటలతో సినిమా మొదటి గంట గడిచిపోతుంది. కాని ఇంటర్వెల్ ముందు 20 న నిముషాలు మాత్రం కొంత ఆసక్తిగా మలిచాడు రవి. ఇంటర్వెల్ కి ఏదో ఆ కాసేపు కొద్దిగా పట్టి ఉంచిన సుస్పెన్సు కాస్తా వీడిపోతుంది. ఆ తరవాత తెలుగు సినిమాతో అనుబందం ఉన్న ప్రతి ఒక్కరు ఊహించే కధనంతో పరమ రొటీన్ గా సాగిన రెండో సగం ఒక సాదారణ క్లైమాక్స్ తో చప్పగా ముగుస్తుంది.
మాటల రచయత ఘటికాచలం సినిమా కోసం మాటలు వ్రాశాడో... లేక ట్రైలర్స్ కోసం మాటలు వ్రాశాడో... అర్ధం కాదు. ఎందుకంటే కాస్తా చెవులకు ఇంపుగా వినిపించిన నాలుగు డైలాగులు ట్రైలర్స్ లో విని వెళ్ళిన ప్రేక్షకులకు అవి మినహా మరో మంచి డైలాగ్ సినిమాలో వినపడక పోవటం భాద కలిగిస్తుంది. సింహ ఇచ్చిన కిక్ ఏమో కాని చక్రి బాలయ్య మీద ప్రయోగం చేసాడు. బాలయ్య సినిమాలో పాటలంటే సరదాగా హమ్ చేసుకునే విధంగా ఉండాలి. ఇందులో ఒక్క పాట కూడా గుర్తుకుచేసుకుని పాడుకునేట్టు లేదు. బ్యాక్ స్కోరు విషయానికి వస్తే.... సన్నివేశాల్లో పస లేక పొతే ఎంత వాయిస్తే మాత్రం ఏం వినపడుద్ది...? సురేందర్ రెడ్డి , గౌతంరాజు లాంటి టాప్ టెక్నిషియన్స్ ఉన్నప్పటికీ శ్రీమన్నారాయణ సాంకేతికంగా ఉన్నతంగా ఉంది అని చెప్పలేని పరిస్థితి. నిర్మాణాత్మక విలువలు బాలయ్యకు తగ్గటు, ఎల్లో ఫ్లోవర్స్ బ్యానర్ రేంజ్ తెలియజేసేలా మాత్రం లేవు.
నందమూరి అభిమానులను అలరించటానికి అవిరామంగా కష్టపడుతూనే ఉంటాడు బాలయ్య అని మరో సారి ఈ సినిమాతో నిరూపించాడు. కొత్తగా కనిపించటానికి తన ప్రయత్నలోపం లేకుండా కష్టపడ్డాడు. కాని ఆయన్ని ఉపయోగించుకోవటం చేతకాని వాళ్ళదే తప్పంతా...! సినిమా మొత్తం మంచి ఎనర్జీతో చాలా ఉత్సాహంగా కనిపించాడు . అవకాశం మేర పదునైన డైలాగులు వదులుతూ , పాటల్లో జోరుగా నృత్యాలు చేస్తూ అబిమానులను ఆకట్టుకున్నాడు. ఎండు నక్కల తయారైన పార్వతి మిల్టన్ చిత్రహింస పెట్టింది. బక్కగా ఉన్న ఆమె స్టెప్పులేస్తుంటే నిండుదనం లేక తేలిపోయింది. ఇషా ఆకట్టుకుంది. పెర్ఫర్మన్సుకి పెద్దగా స్కోప్ లేక పోయిన ఉన్నంతలో బాగానే చేసింది. విజయ్ కుమార్ గంభీరంగా కనిపించారు. విల్లన్ లు గా ఆరుగురు ఉన్నప్పటికీ ఏ ఒక్క పాత్ర వైవిద్యంగా అనిపించదు. కాని వారి పాత్రలకనుగుణంగా కోట , సురేష్, రావు రమేష్,తదితరులు బాగానే చేసారు. యం యస్ దువ్వాసి, కృష్ణ భగవాన్ చేసిన కామెడీ ఆకట్టు కోలేదు.
ప్లస్ పాయింట్స్:
బాలకృష్ణ నటన, డాన్సులు, డైలాగులు మొదలైనవి ప్లస్ పాయింట్స్
మైనస్ పాయింట్స్:
బలహీనమైన కధ , బలంలేని కధనం, పూర్ డైరెక్షన్ ప్రధానంగా మైనస్ పాయింట్స్.
కొసమెరుపు;
శ్రీమన్నారాయణ సినిమా చూసి పర్వాలేదు.... ఓకే! అని బాలయ్య వీరాభిమాని సర్దుకుపోవచ్చుకాని... సగటు ప్రేక్షకుడు ఈ సినిమాను జీర్ణించుకోవటం కష్టమే. కొత్తదనం కోరుకునే వాళ్ళైతే ఈ సినిమా గురించి ఆలోచించనవసరం కూడా లేదు...!
Maruthi Talkies Rating 2 out of 5

No comments:
Post a Comment