ఒక సినిమా సూపర్ హిట్ అనిపించుకున్న దానికంటే అందరి అభిమానాన్ని చూరగుని కల్తిలేని మెప్పును పొందుతున్నప్పుడు కలిగే ఆనందమే ఆ సినిమా రూపకర్తలకు ఎనలేని సంతృప్తినిస్తుంది. ఇప్పుడు ఆ మధురమైన అనుభూతిని మనస్పూర్తిగా ఆస్వాదిస్తున్నారు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు టీమ్. నిన్న సాయంకాలం శిల్పకళావేదికలో జరిగిన ఈ సినిమా సరిగమల పండుగ సీతమ్మ కుటుంబ సభ్యుల ఆనందపరవశ్యాన్ని తెలుగు సినీ ప్రేమికులతో పంచుకునేందుకు వేదికగా మారింది. అందరికంటే సినిమాకు, అందులో తను చేసిన పాత్రకు దక్కుతున్నప్రశంశలు మహేష్ ను ఉద్విగ్నతకు పురికొల్పి కంట్రోల్ తప్పేలా చేశాయి. అదే నిన్నటి వేడుకకు ప్రత్యేకమైన ఆకర్షణ.
ప్లాటినం డిస్క్ వేడుకకు హాజరైన హితులు, అతిధులు, మహారధులు సినిమా గురించి పొగుడుతుంటే ఎమోషనల్ అవటం అనేది ఎవరికైనా సహజమే. కాని కొన్ని లక్షలమంది గుండెల్లో అభిమానం సంపాయించుకున్న సూపర్ స్టార్ భావోద్వేగభరితుడైతే అయన అభిమానులు తట్టుకోగలరా...! సినిమాలలో అభిమాన హీరో అభినయాన్ని చూసి ముగ్దులయి పోతారు ఫాన్స్. అలాంటిది ఆ హీరో నటన అనే అడ్డు తెరను పక్కన పెట్టి మనసులో కలిగే ఆనందాన్ని ఆపుకోలేక ఎమోషన్ను బయట పెట్టేస్తే అబిమానుల పరిస్థితేంటి..? సరిగమల పండుగ సాక్షిగా మహేష్ అలానే ఉద్విగ్నతకు లోనై కళ్ళలోకి నీళ్ళు తెచ్చుకుని అభిమానులను ఏడిపించాడు. అందున ఈ అందగాడికి లేడి ఫాన్స్ ఎక్కువేమో... ఈ సోకాలా రేటింగ్ ఎక్కువగానే ఉండొచ్చని ఒక అంచనా...!
సీతమ్మ సినిమా అనుకోగానే పెద్దోడిగా వెంకటేష్ ఓకే కాని చిన్నోడిగా ఈ పోకిరి సరిపోతాడా అని అనుమాన పడి.. సినిమా చూశాక తెలుగాబ్బయిగా మహేష్ ప్రదర్శించిన నటనా చొరవకు ముగ్డుడినయ్యనని సీతారామ శాస్త్రి లాంటి ఉద్దండుడు చెబితే కళ్ళలో నీళ్ళు తిరగవా... ? అప్పటి వరకు ఫంక్షన్లో ఏంతో సరదాగా కనిపించిన మహేష్, శాస్త్రిగారి మాటలు వింటూ కొంత ఎమోషనల్ అయ్యాడు. ఈ విషయాన్నే స్టేజ్ ఫై తలచుకుంటూ, సినిమాకు ఇంత విజయాన్ని కట్టబెట్టిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతూ మహేష్ దాదాపు ఏడ్చినంత పనిచేశాడు. మహేష్ మాట్లాడిన విధానం చూస్తే ఆయన అభిమానులకే కాదు ఎవరికైనా మనసు కరుగుతుంది. ఇది చూసిన తరవాత అర్ధం అయ్యేది ఏమిటంటే.. కొత్తగా కెరీర్ మొదలు పెట్టిన చిన్న ఆర్టిస్ట్ కే కాదు మహేష్ లాంటి సూపర్ స్టార్ కు కూడా ఒక మంచి విజయం ఇచ్చిన పరిపూర్ణమైన ఆనందాన్ని మనసులోపల దాచుకోవటం కష్టమే అని...!

No comments:
Post a Comment