నటుడిగా తనికెళ్ళ భరణి మనందరికీ సుపరిచితమే..! కాని చాలా మందికి పెద్దగా పరిచయం లేని కోణం అయన రచయత కావటం. అప్పుడెప్పుడో... వంశీ గారి సినిమాలకు మాటలు వ్రాసిన అయన తరవాత నటుడిగా బిజీ అయ్యాక తన రచనతత్వాన్ని మంది కోసం కాకుండా మనశ్శాంతి కోసమే పరిమితం చేసుకుని సన్నిహితుల వరకే వినిపిస్తూ వచ్చాడు. కుండలో ఉన్నంత వరుకే గుట్టు... ఒకసారి కుండ నిండి అందులోని పదార్ధం బయటకు ప్రవహించటం మొదలు పెట్టక ఎంత దాచాలనుకున్న ఆగకుండా నలుగురికి తెలిసిపోతుంది. ఇప్పుడు భరణి గారి విషయంలో మిధునం సినిమాకు సంబంధించి అదే జరుగుతుంది.
సినిపరిశ్రమలో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నా భరణి ఇప్పడు కూడా బోల్డంత బిజీగా ఉన్నా నటుడు. కావాలనుకుంటే కళ్ళు మూసుకుని ఇదే జీవితాన్ని సుఖంగా లాగేసేయ్యవచ్చు. కాని ఆయనలో అంతర్గతంగా మంచి ఆలోచనలతో ఉన్న రచయత, అనుభవం మలచిన దర్శకుడు ఓ పట్టానా ఆయన్ని నిద్రపోనిచ్చినట్టులేరు. సందర్భాన్ని బట్టి సభల్లోనూ , లఘు చిత్రలతోనో... ఆ ప్రతిభలను సంతృప్తి పరుస్తూ వస్తున్నా భరణి ఈసారి వీలుచూసుకుని తెలుగుదనానికి అభిషేకం చేస్తూ... 'మిధునం' అనే వినోదం నిండిన సాహసాత్మక ప్రయోగ చిత్రాన్ని రూపొందించి తెలుగువాళ్ళు ముచ్చటపడేలా చేశారు.
కధ :
కాటికి కాళ్ళు చాచుకు కూర్చుని కూడా తన పనులు తాను చేసుకుంటూ... తన బతుకు తానూ బతకాలనుకునే ఓ పడుచు మనసు ముసలాయన అప్పదాసు(యస్ పి బాలు). ఈముసలాయనే సర్వస్వం అనుకుంటూ.. అమితమైన ప్రేమతో ఆయన్ని చిన్నపిల్లాడిలా సాకుతూ మురిసిపోతూ ఉంటుంది.. అప్పరాజు 60 ఏళ్ళ పడుచు భార్య బుచ్చి లక్ష్మి(లక్ష్మి). ఐదుగురు పిల్లలుండి అందరు బాగా స్థిర పడి ఉన్నప్పటికీ 'అటాచ్డ్ డిటాచ్మెంట్' అనే సిద్దాంతాన్ని నమ్మి తనకంటూ ఒక చిన్న ప్రపంచాన్ని సృష్టించుకుని అందులో భార్య కు మాత్రమే స్థానం కల్పించి జీవితపు ఆఖరి మజిలిని ఎంతో హాయిగా గడిపేస్తూ ఉంటాడు అప్పరాజు. ఆ క్రమంలో ఈ వృద్ద దంపతుల జీవితంతో అన్యోన్యత, ఆప్యాయత, ప్రేమ వంటి మహోత్క్రుష్టమైన మనవసంబందాలు ఎలా పెన వేసుకున్నాయో...వాటిలో ఉన్న ఆనందమెంతో... ఈ సినిమా మనకు చూపిస్తుంది.
విశ్లేషణ :
'మిధునం' మనసుకు హత్తుకునే ఒక అందమైన దృశ్య కావ్యం. ఈ సినిమాకు సంబంధించి తోలి, సింహ భాగ ప్రశంశలు దర్శకరచయత తనికెళ్ళ భరణి గారికి దక్కాలి... మిగిలినవి బాలుగారి, లక్ష్మిగారికి చెందుతాయి. ఎందుకంటే ఇలాంటి కధావస్తువు కధగానే ఎక్కువ హిట్ అవుతుంది.. సినిమాగా గట్టెక్కటం చాలా కష్టం(వ్యాపారపరంగానే కాదు.. కంటెంట్ పరంగా కూడా ). ముందు అసలు ముసలోళ్ళ ప్రేమ కధ అనే పాయింట్ అని వినగానే కిలోమీటర్లు దూరం పారిపోయే సినిమావాళ్ళే ఎక్కువ. అలాంటిది ఎక్కడో చదివిన 25 పేజీల కధ నచ్చి సాహసంతో సినిమా తీయ్యలని సంకల్పించుకుని కష్టమో.. నష్టమో.. సినిమాను తీసి చూపించినందుకు భరణి గారిని శేభాష్ ..... అని మెచ్చుకు తీరాల్సిందే...!
కధ విషయానికి వస్తే 'ముసలోళ్ళా ప్రేమ కధా....! ఇక అందులో చూడటానికి ఏముంటుంది... ? అందులోను భరణి గారు గతంలో సిరా .. గిరా అంటూ అర్ధం కాని రీతిలో క్లాసులు పీకాడు. ఈ సినిమాలో కూడా మహాయితే .. పిల్లలు వదిలిసిన తల్లి తండ్రులు పడే భాదో.., పెద్దలతో పిల్లలు ఎలా ఉండాలనో... ఎలా ఉండకూదనో... క్లాసులు పికుంటాడు అని అనుకుంటే... పప్పులో కాలేసినట్టే...! ఎందుకంటే ఆలాంటి విషయాలకు ఈ సినిమాలో అసలు చోటే లేదు. నించో పెట్టి లెక్చర్ చెప్పలనే పద్ధతో ... కూర్చో పెట్టి మెసేజ్ ఇవ్వాలనే వాతావరణమో ... మచ్చుకకు కూడా కనిపించవు. జివితగమనంలో చివరి దశకు చేరుకున్నా ఓ ముసలి జంట వారి చివరి రోజులను ఆనందంగా , హాయిగా ఎలా గడిపారు అన్నా విషయానికి ఆరోగ్యకరమైన వినోదాన్ని జోడించి ఏంతో రమ్యగా చూపించారు భరణి.
తెర మీద కనిపించేవి రెండు పాత్రలే. అయినా మొదలు దగ్గర నుండి చివరి వరకు కధనంలో ఎక్కడ బిగి సడలా కుండా పక్కాగా సినిమాను రూపొందించారు. ముఖ్యంగా కధనానికి వన్నె తెచ్చింది.. కధానాయకుడు అప్పరాజు భోజనప్రియుడు కావటంతో.. తెలుగు సాంప్రదాయ వంటకాలను కధలో ఓ ఉప ఇతివృత్తంగా తీసుకోవటం. దాంతో హీరో అప్పరాజు హీరోయిన్ బుచ్చి లక్ష్మి గారు చేసే రకరకాల వంటలను ఆస్వాదిస్తూ.. అద్బుతః...! అంటూ పండించే హాస్యం మన కడుపులను చెక్కలు చేస్తుంది. సినిమాలో అప్పరాజు గారికి అద్బుతః...! అనేది ఊతపదం. సినిమా చూశాక మనకు కూడా ఆ అద్బుతః...! ఊతపదమై కూర్చుంటుంది వద్దనుకున్నా..!
కమ్మటి తెలుగింటి భోజనంలాంటి ఈ సినిమాకు అసలైన రుచి భరణి గారు దట్టించిన రుచికరమైన సంబాషణలు. సంస్కృతం కూడా సరళంగా అర్ధమై హాయిగా నవ్వుకునేలా అయన మాటలు పెనేసారు ఈ సినిమాకు. ఇద్దరు మనుషులు అందులోను ముసలోళ్ళు వాళ్లతో వినోదాన్ని పండించాలంటే.. అది కేవలం మాటలకే సాద్యం. ఆ భాద్యతను ఏంతో సమర్ధవంతంగా నిర్వర్తించారు తనికెళ్ళ. మాటలతో పెట్టిన చక్కిలిగింతలకు వెక్కిళొస్తాయంటే.. నమ్మండి.! ఆయన మాటలతో మురిపించారు.. మరిపించారు...కవ్వించారు... నవ్వించారు.. చివరికి కన్నీళ్ళు పెట్టించారు. ఇద్దరు నటులతో ఒకే ఇంట్లో నడిచే ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని చక్కగా తీర్చి దిద్ది దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరుపించుకున్నారు. భరణి గారి తరవాత చెప్పుకోవాల్సింది బాలుగారు, లక్ష్మిగార్ల గురించి. వాళ్ళిద్దరూ ఈ పాత్రల్లో ఎంతగా లీనమయ్యరంటే ఆ పాత్రలతో మనం కూడా కనెక్ట్ అయిపోతాం... ఆఫై వాళ్ళు నవ్వుతుంటే నవ్వుతాం.. భాధ పడుతుంటే భాద పడతాం... ఆనందపడితే ఆనంద పడతాం..! అంతలా వాళ్ళిద్దరూ ఎంతో సహజంగా నటనలో జీవించి మెప్పించారు.
ఈ సినిమా అణువణువునా హాస్యం,చిలిపితనం,ఆనందం,అన్నిటికి మించి అచ్చ తెనుగు కమ్మదనం కనిపిస్తుంది. విటన్నిటిని చూసుకుంటూ ఇది నా తెలుగు సినిమా అని గర్వపడెంత గొప్పతనాన్ని కలిగిస్తుంది ఈ సినిమా. ఇంత ప్రత్యేకమైన ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆహా ..! ఈ 'మిధునం' అద్బుతః ...!
ఈ సినిమా అణువణువునా హాస్యం,చిలిపితనం,ఆనందం,అన్నిటికి మించి అచ్చ తెనుగు కమ్మదనం కనిపిస్తుంది. విటన్నిటిని చూసుకుంటూ ఇది నా తెలుగు సినిమా అని గర్వపడెంత గొప్పతనాన్ని కలిగిస్తుంది ఈ సినిమా. ఇంత ప్రత్యేకమైన ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆహా ..! ఈ 'మిధునం' అద్బుతః ...!
రేటింగ్ :
రెగ్యులర్ సినిమాలులా ఈ సినిమాను రేటింగ్ తో కట్టి పడేయ్యాలెం..! ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న భావాన్ని మనసులో నింపుకోగలమే కాని రేటింగ్ తో కొలవలేం...!
సూచన :
ఈ సినిమాను రెగ్యులర్ ఎంటర్టైనర్ గా చూడాలనుకుంటే మాత్రం అందులోని వినోదాన్నిఅస్వాదించలేరు. సినిమాలలో చాలా రకాలు ఉంటాయి. థ్రిల్లర్ , యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ , రొమాంటిక్ కామెడీ ఇలా పలు రకాలు. అలానే ఈ సినిమా 'మంచి సినిమా' అనే రకానికి చెందింది. ఈ సినిమాకు వెళ్ళే ముందు ఇది ఇద్దరి ముసలోళ్ళ ప్రేమ కధ అని క్లారిటికి వచ్చి.. అది ఎలా ఉంటుందో చూడాలి అని అనుకుని వెళ్తే... సినిమా మిమ్మల్ని ఊహించని రీతిలో ఆనందపరుస్తుంది. అలా కాకుండా అది లేదు.. ఇది లేదు... ఏవో కావాలి అని వంకలు ఉంటే మాత్రం సినిమాకు వెళ్ళక పోవటమే ఉత్తమం.

No comments:
Post a Comment